Narendra Modi: భారత క్రికెటర్ల సంతకాలున్న బ్యాట్ ను మాల్దీవుల అధ్యక్షుడికి బహూకరించిన మోదీ

  • రెండోసారి ప్రధాని అయ్యాక మోదీ తొలి విదేశీ పర్యటన
  • శనివారం మాల్దీవులు వెళ్లిన మోదీ
  • అధ్యక్షుడు సోలిహ్ తో ద్వైపాక్షిక చర్చలు

భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం మాల్దీవుల పర్యటనలో ఉన్నారు. శనివారం ఆయన మాల్దీవుల రాజధాని మాలే చేరుకున్నారు. రెండో పర్యాయం ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మోదీ చేస్తున్న తొలి విదేశీ పర్యటన ఇదే. ఈ సందర్భంగా వరల్డ్ కప్ లో ఆడుతున్న భారత క్రికెటర్ల సంతకాలతో కూడిన ఓ క్రికెట్ బ్యాట్ ను ప్రధాని మోదీ మాల్దీవుల అధ్యక్షుడు ఇబ్రహీం మహ్మద్ సోలిహ్ కి కానుకగా ఇచ్చారు. మాల్దీవుల్లో కూడా క్రికెట్ ఓ క్రీడగా అభివృద్ధి చెందాలన్న ఆకాంక్షతోనే బ్యాట్ ను బహూకరిస్తున్నట్టు మోదీ మాల్దీవుల అధ్యక్షుడితో చెప్పారు.

అంతకుముందు, మోదీ, సోలిహ్ మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. ఇరుదేశాల మధ్య కీలకంగా ఉన్న అనేక వాణిజ్య ఒప్పందాలు, పరస్పర సహకార అంశాలు ఈ సందర్భంగా చర్చకు వచ్చాయి. కాగా, మాల్దీవుల్లో క్రికెట్ అభివృద్ధి కోసం ప్రయత్నిస్తున్న భారత్ అక్కడ ఓ స్టేడియం నిర్మాణానికి ప్రయత్నిస్తోంది. బీసీసీఐకి చెందిన ఓ బృందం మే నెలలో మాల్దీవులు వెళ్లి అక్కడి ఔత్సాహిక క్రికెటర్లకు శిక్షణ ఇవ్వడమే కాకుండా, కిట్లు కూడా పంపిణీ చేసింది.

More Telugu News