Crime News: అన్నను చంపేసి చెట్టుపై నుంచి పడిపోయినట్టు కట్టు కథ.. గుట్టు రట్టు చేసిన పోలీసులు

  • నిద్రలో ఉండగా అన్నను గొడ్డలితో నరికి చంపిన తమ్ముడు
  • ఆ తర్వాత ప్రమాదం జరిగిందంటూ అంత్యక్రియలకు ఏర్పాట్లు
  • అసలు సంగతి బయటపెట్టిన పోలీసులు
కుటుంబ కలహాల నేపథ్యంలో అన్నపై కక్ష పెంచుకున్న తమ్ముడు క్షణికావేశంలో అతను నిద్రలో ఉండగా గొడ్డలితో నరికి చంపేశాడు. అనంతరం చెట్టుపై నుంచి పడిపోయినట్టు కట్టు కథ అల్లి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశాడు. అయితే గుర్తు తెలియని వ్యక్తులు ఇచ్చిన సమాచారం మేరకు రంగంలోకి దిగిన పోలీసులు అసలు కథ విప్పడంతో వాస్తవం బయటపడింది.

పోలీసుల కథనం మేరకు...గుంటూరు జిల్లా చుండూరుకు చెందిన ఏనుగు వెంకటేశ్వరరావుకు ఇద్దరు కొడుకులు. పెద్దకొడుకు శ్రీనివాసరావు (30) చిరువ్యాపారి. రెండో కొడుకు గోపి తాపీ మేస్త్రి. కుటుంబ తగాదాల నేపథ్యంలో శ్రీనివాసరావు, గోపి మధ్య గురువారం రాత్రి స్వల్ప వివాదం చోటు చేసుకుంది. దీన్ని మనసులో పెట్టుకున్న గోపి కక్షతో రగిలిపోతూ శుక్రవారం తెల్లవారు జామున నిద్రపోతున్న అన్నను గొడ్డలితో నరికి చంపేశాడు. ఆ తర్వాత ఏం చేయాలో అర్థంకాక చెట్టు మీద నుంచి పడిపోయి చనిపోయినట్టు తెల్లారేసరికి ఓ కట్టు కథ అల్లాడు.

పెద్ద కొడుకు మృతి బాధిస్తున్నా, ఉన్న కొడుకును రక్షించుకునేందు తల్లిదండ్రులు కూడా వాస్తవాన్ని దిగమింగుకుని గోపికి వత్తాసు పలికారు. అంతిమ సంస్కారానికి ఏర్పాట్లు చేస్తుండగా పోలీసులు రంగప్రవేశం చేశారు. గోపిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో ప్రశ్నించడంతో అసలు విషయం బయటకు వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేశారు.
Crime News
man murdered
brother accused
Guntur District

More Telugu News