Pawan Kalyan: పార్టీ కోసం సొంత పత్రిక పెడుతున్నట్టు జనసేన అధినేత పవన్ ప్రకటన

  • పార్టీ భావజాలాన్ని ప్రజలకు చేరవేసేందుకు పక్ష పత్రిక
  • పత్రిక స్వరూపం, శీర్షికల నిర్ణయం కోసం కమిటీ ఏర్పాటు
  • సెప్టెంబరులో తొలి ప్రతి విడుదల

జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో నిన్న జరిగిన పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులు, పార్టీ ముఖ్య నేతల సమావేశంలో పవన్ మాట్లాడుతూ.. పార్టీ భావజాలాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేసేందుకు, పార్టీ ప్రణాళికలు, నిర్ణయాలు ప్రజలకు తెలిసేలా పార్టీ తరపున ఓ పక్ష పత్రిక పెట్టబోతున్నట్టు వెల్లడించారు. మేధావులు తమ అభిప్రాయాలను వెల్లడించేందుకు ఈ పత్రిక వేదిక అవుతుందన్నారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంతో పాటు  పరిష్కారానికి ఈ పత్రిక తోడ్పాటు అందిస్తుందన్నారు.  

జనసేన నుంచి రానున్న ఈ పత్రికలో రాష్ట్ర, దేశ, విదేశాలకు చెందిన విధాన నిర్ణయాలు, అభివృద్ధి రంగాలకు చెందిన సమాచారాన్ని పొందుపరచాలని పవన్ సూచించారు. అలాగే, పత్రిక స్వరూప స్వభావాలు, ఎటువంటి శీర్షికలు ఉండాలి అనే విషయంలో ఓ కమిటీని నియమించినట్టు తెలిపారు. పత్రిక తొలి ప్రతిని సెప్టెంబరులో విడుదల చేయబోతున్నట్టు పేర్కొన్నారు. పత్రిక ఈ-మ్యాగజైన్‌తో పాటు ముద్రిత సంచికను కూడా కార్యకర్తలకు అందుబాటులో ఉంచుతామని పవన్ పేర్కొన్నారు.

More Telugu News