Andhra Pradesh: హత్య కేసు ఛేదనలో నెల్లూరు పోలీసులకు సాయపడిన రజనీకాంత్ ఫొటో!

  • డబ్బు, నగల కోసం మహిళను హత్య చేసిన ఆటో డ్రైవర్
  • హత్య కేసు ఛేదనలో కీలకంగా మారిన రజనీకాంత్ ఫొటో
  • వారం తర్వాత నిందితుడికి అరదండాలు

రజనీకాంత్ ఫ్లెక్సీతో ఉన్న ఆటో ఓ హత్య కేసును ఛేదించేందుకు పోలీసులకు ఉపయోగపడింది. నెల్లూరు జిల్లాలో జరిగిందీ ఘటన. నెల్లూరులోని రామలింగపురంలో నివసిస్తున్న బొందిలి నిర్మలాబాయి (45) ఓ ప్రైవేటు స్కూల్లో క్లర్క్‌గా పనిచేస్తున్నారు. ఆమె భర్త రమేశ్ సింగ్ మూడేళ్ల క్రితమే చనిపోయాడు. కుమారుడు బెంగళూరులో పనిచేస్తుండగా, కుమార్తె తిరుపతిలో చదువుకుంటోంది. దీంతో ఆమె నెల్లూరులో ఒంటరిగా జీవిస్తోంది.
 
వారం రోజుల క్రితం నిర్మల హత్యకు గురైంది. కత్తితో ఆమెను పదిసార్లు పొడిచి చంపారు. అనంతరం ఆమె మృతదేహాన్ని తగలబెట్టారు. ఆమె ఇంటి నుంచి మంటలు వస్తుండడంతో అప్రమత్తమైన ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం మూడు బృందాలను ఏర్పాటు చేసి గాలింపు మొదలుపెట్టారు.

ఈ సందర్భంగా నిర్మల ఇంటి సమీపంలో ఉన్న సీసీ టీవీ కెమెరాలను పరిశీలించారు. తమిళ సినీ నటుడు రజనీకాంత్ ఫ్లెక్సీతో ఉన్న ఓ ఆటో హత్యకు కొద్ది సమయం ముందు నిర్మల ఇంటి వద్దకు వచ్చి ఆగింది. హత్య తర్వాత ఆటో వెళ్లిపోయింది. క్లూ దొరికినట్టు భావించిన పోలీసులు రజనీకాంత్ ఫొటోతో ఉన్న ఆటో కోసం గాలించారు. మొత్తంగా పదివేల ఆటోలను చెక్ చేశారు.

ఎట్టకేలకు నిన్న (సోమవారం) నగరంలోని అపోలో ఆసుపత్రి జంక్షన్ వద్ద రజనీకాంత్ ఫొటోతో ఉన్న ఆటో కనిపించింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆటో డ్రైవర్ రామస్వామి అలియాస్ వేమసాని శ్రీకాంత్, అలియాస్ రజనీకాంత్(22)ను అదుపులోకి తీసుకున్నారు.
 
నిర్మలను తానే హత్య చేసినట్టు విచారణలో నిందితుడు అంగీకరించాడు. ఆమెను చంపి బంగారు చైను, గాజులు, చెవి కమ్మలు, రూ.2వేల నగదును దోచుకున్నట్టు చెప్పాడు. అనంతరం ఇంట్లోని దినపత్రికలను ఆమె మృతదేహంపై వేసి తగలబెట్టినట్టు చెప్పాడు. ప్రమాదం జరగడం వల్లే ఆమె మరణించిందన్న భావన కలిగేలా, వెళ్తూవెళ్తూ గ్యాస్‌ను లీక్ చేశానని పోలీసులకు చెప్పాడు.

More Telugu News