Formation day: రైతులకు తెలంగాణ ప్రభుత్వం నజరానా :లక్ష రుణ మాఫీ ప్రకటించిన కేసీఆర్

  • రాష్ట్ర అవతరణ వేడుకల్లో వెల్లడి
  • ప్రపంచాన్నే ఆకర్షించిన పథకం రైతుబంధు
  • పాలనలో జవాబుదారీ తనం తీసుకువస్తామన్న ముఖ్యమంత్రి

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు రైతులకు నజరానా ప్రకటించారు. ఈ ఏడాది అదనంగా మరో లక్ష రుణం మాఫీ చేయనున్నట్లు ప్రకటించారు. వేడుకల్లో భాగంగా హైదరాబాద్‌ పబ్లిక్‌ గార్డెన్స్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న కేసీఆర్‌ మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షలు, ప్రభుత్వ కార్యక్రమాలు, భవిష్యత్తు కార్యాచరణపై సుదీర్ఘంగా ప్రసంగించారు.

తెలంగాణ మహోద్యమం దేశ చరిత్రలోనే ప్రత్యేకమైనందన్నారు. రాష్ట్రం సాధించుకున్నాక ఈ ఐదేళ్లలో ఎన్నో అవరోధాలను అధిగమించి ప్రగతి పథంలో దూసుకుపోతున్నామని చెప్పారు. 16.5 శాతం వృద్ధిరేటు ఇందుకు సాక్ష్యమన్నారు. రైతు సంక్షేమం కోసం రాష్ట్రం అమలు చేసిన 'రైతుబంధు’ పథకం ప్రపంచ దృష్టిని ఆకర్షించిందని, ఇదో గొప్ప పథకమని ఐక్యరాజ్య సమితి ప్రశంసించిన విషయాన్ని గుర్తు చేశారు. కేంద్రం రైతులకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు రైతు బంధు పథకమే ప్రేరణ అన్నారు. రైతు మరణిస్తే రైతు బీమా పథకం కింద రూ.5 లక్షలు అందజేస్తున్నామని, ఈ పథకానికి ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.

మిషన్‌ కాకతీయ అంతర్జాతీయ ప్రశంసలు పొందిందని, పెండింగ్‌ ప్రాజెక్టులను వాయువేగంతో పూర్తి చేయనున్నట్లు తెలిపారు. ప్రపంచంలోనే వేగంగా నిర్మించే ప్రాజెక్టుగా కాళేశ్వరం చరిత్రలో నిలిచిపోతుందని చెప్పారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాను సమర్థంగా వినియోగించుకున్నామని, మహబూబ్‌నగర్‌ జిల్లాలో 10 లక్షల ఎకరాలకు సాగునీరందించడంలో సఫలమయ్యామని తెలిపారు. సీతారామ ఎత్తిపోతల పథకం పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయని చెప్పారు. అన్ని నీటి వనరుల్లోనూ చేపల పెంపకాన్ని ప్రోత్సహిస్తామని తెలిపారు.

రాజకీయ అవినీతికి దూరంగా ఉన్న బలమైన రాష్ట్రం మనదని, 24 గంటలు విద్యుత్‌ ఇచ్చిన ఘనత కూడా మన సొంతమేనని తెలిపారు. చేనేత కార్మికుల ఆత్మహత్యల నివారణ కోసం బతుకమ్మ చీరల తయారీ బాధ్యతను వారికి అప్పగించి కార్మికుల సమస్యలను పరిష్కరించిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానిదేనని చెప్పారు. విద్యా ప్రమాణాలు పెంచడంలోను, దళారుల ప్రమేయంలేని పింఛన్ల పంపిణీ వల్ల ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని సొంతం చేసుకుందన్నారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలను పెంచడం ద్వారా ప్రజా వైద్యంపై ప్రజలకు విశ్వాసం పెరిగేలా చేయగలిగామని కేసీఆర్‌ తెలిపారు. ‘కంటి వెలుగు’ పథకం ప్రజలకు వరంగా మారిందని, దీని స్ఫూర్తితో ఈఎన్‌టీ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. బతుకమ్మ, బోనాలు, క్రిస్మస్‌, రంజాన్‌లను రాష్ట్ర వేడుకలుగా గుర్తించామన్నారు.

ఆయా కులాలకు హైదరాబాద్‌లో ఆత్మగౌరవ భవనాలు నిర్మిస్తామని చెప్పారు. స్థానిక సంస్థల పనితీరు మెరుగుపరిచేందుకు పంచాయతీరాజ్‌ చట్టం తెచ్చామని, గ్రామ పరిపాలనలో అవినీతికి ఆస్కారం లేకుండా చూస్తామని కేసీఆర్‌ భరోసా ఇచ్చారు. అవినీతిని పారదోలితే ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం కలుగుతుందని, పాలనలో జవాబుదారీ తనం కోసం పురపాలక చట్టాన్ని తెస్తున్నామని తెలిపారు.

More Telugu News