Karnataka: రాజకీయ వైరానికి నటుడు నిఖిల్ తెర.. సుమలతను అక్కా అని సంబోధిస్తూ అభినందనలు!

  • మాండ్య నుంచి పరస్పరం తలపడిన సుమలత-నిఖిల్
  • క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించిన నిఖిల్
  • నిఖిల్ పోస్టుపై ప్రశంసల జల్లు
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కర్ణాటకలోని మాండ్య నియోజకవర్గం నుంచి కన్నడ నటుడు, సీఎం కుమారస్వామి కొడుకు నిఖిల్- సీనియర్ నటి సుమలత పరస్పరం ఢీకొన్నారు. హోరాహోరీగా జరిగిన ఈ పోరులో చివరికి స్వతంత్ర అభ్యర్థి అయిన సుమలత ఘన విజయం సాధించారు. తనపై విజయం సాధించిన సుమలతను అభినందిస్తూ నిఖిల్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పెట్టిన పోస్టు ఇప్పుడు వైరల్ అవుతోంది.

తాను అనుబంధాలకే ప్రాధాన్యం ఇస్తానని, ఎన్నికల ప్రచారంలోనూ ఇదే విషయం చెప్పానన్న నిఖిల్.. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన సుమక్కకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్టు ఆ పోస్టులో పేర్కొన్నారు. సుమలత కుమారుడు అభిషేక్‌తో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేశారు. అభిషేక్ నటించిన తొలి చిత్రం అమర్‌ను తన అభిమానులు ఆదరించాలని కోరారు. కాగా, తన కోసం కష్టపడిన కార్యకర్తలు, తనకు ఓట్లేసిన ప్రజలకు నిఖిల్ ధన్యవాదాలు తెలిపారు.

సుమలతను అక్కా అని సంబోధిస్తూ నిఖిల్ పెట్టిన పోస్టుపై సర్వత్ర ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ స్పందిస్తూ.. క్రీడాస్ఫూర్తికి సరైన నిర్వచనం చెప్పావంటూ నిఖిల్‌ను ప్రశంసించారు. ఎన్నికలు వస్తుంటాయి, పోతుంటాయని కానీ, జీవితం రాజకీయాలకు అతీతమైనదని పేర్కొన్నారు. ఇలాంటి ప్రవర్తనతో నడుచుకుంటే ఏదో ఒక రోజు విజేతగా నిలవడం ఖాయమన్నారు. నిఖిల్ శుభాకాంక్షలు తెలియజేసిన విధానం బాగుందని, భవిష్యత్తులో అంతా మంచే జరగాలని కోరుకుంటున్నట్టు కృష్ణ పేర్కొన్నారు.

ఎన్నికల్లో ఓడినా తాను రాజకీయాల్లో కొనసాగుతానని నిఖిల్ తన పోస్టు ద్వారా స్పష్టం చేశారు. త్వరలోనే జిల్లాల పర్యటన చేపడతానని తెలిపారు. ఎన్నికల్లో ఓడినా వ్యక్తిగతంగా ఎంతో నేర్చుకున్నానని, తన పోరాటం నిరుత్సాహపరిచి ఉంటే కార్యకర్తలు తనను క్షమించాలని నిఖిల్ కోరారు. కాగా, నిఖిల్ పోస్టుపై స్పందించిన సుమలత నమస్కారం ఎమోజీతో రీట్వీట్ చేశారు.
Karnataka
sumalatha
Nikhil
JDS
Kumraswamy

More Telugu News