Congress: సోనియా గాంధీ ఈజ్ బ్యాక్.. కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేతగా ఎన్నిక!

  • ఖర్గే ఓటమితో మారిన సమీకరణాలు
  • ముందుకు రాని రాహుల్ గాంధీ
  • పార్టీలో మళ్లీ సోనియా శకం

కాంగ్రెస్ పార్టీలో సోనియాగాంధీ శకం మళ్లీ మొదలయింది. ఈరోజు ఢిల్లీలో జరిగిన పార్టీ సమావేశంలో కాంగ్రెస్ నేతలు ఆమెను పార్టీ పార్లమెంటరీ నేతగా ఎన్నుకున్నారు. తొలుత సోనియా పేరును మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ ప్రతిపాదించగా, పార్టీ నేతలంతా ఆమోదం తెలిపారు. గత ఐదేళ్ల పాటు కాంగ్రెస్ పక్ష నేతగా వ్యవహరించిన ఖర్గే ఈ లోక్ సభ ఎన్నికల్లో కర్ణాటకలోని కలబురిగి లోక్ సభ స్థానంలో తొలిసారి ఓటమి చవిచూశారు.

దీంతో కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేతగా కొత్తవారిని ఎన్నుకోవాల్సిన అవసరం ఏర్పడింది. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ రాజీనామా సమర్పించడంతో సోనియా బాధ్యత తీసుకోవడం అనివార్యమయింది. 1998 మార్చి 14న కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన సోనియా, 2017, డిసెంబర్ 16 వరకూ పార్టీ అధ్యక్షురాలిగా కొనసాగారు. ఆమె తర్వాత బాధ్యతలు స్వీకరించిన రాహుల్.. ఇటీవల రాజీనామా సమర్పించగా, సీడబ్ల్యూసీ తిరస్కరించింది.

More Telugu News