Hyderabad: లిఫ్ట్‌లో ఇరుక్కుని తాపీ మేస్త్రి మృతి... మరమ్మతు పనులు చేస్తుండగా ఘటన

  • పవర్‌ సరఫరా నిలిపి వేయకుండా పని
  • ఇది తెలియక లిఫ్ట్‌ ఆన్‌ చేసిన నివాసితులు
  • తీవ్రంగా గాయపడిన మేస్త్రిని ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి

అవగాహనా లోపం, నిర్లక్ష్యం కారణంగా ఓ మేస్త్రి ప్రాణాలు కోల్పోయాడు. లిఫ్ట్‌ మార్గంలో మరమ్మతు పనులు చేపడుతుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాల్లోకి వెళితే...హైదరాబాద్‌ మల్కాజిగిరి వాణీనగర్‌ రెండో వీధిలో వరుణ్‌ టవర్స్‌ ఉంది. సిద్ధిపేట జిల్లా కొండపాక మండలం మంగోలు గ్రామానికి చెందిన తాపీ మేస్త్రి కె.శంకర్‌ (38) మల్కాజిగిరిలో ఉంటున్నాడు.వరుణ్‌ టవర్స్‌లో ఎటువంటి పనులున్నా ఇతనితోనే చేయిస్తుంటారు.

ఈ క్రమంలో మొదటి అంతస్తులో లిఫ్ట్‌ వద్ద పైపుల పట్టీ సరిగా లేకపోవడంతో పనులు చేపట్టాలని అసోసియేషన్‌ శంకర్‌ను కోరింది. ఈ పనులు చేపట్టేందుకు మంగళవారం రాత్రి వెళ్లిన శంకర్‌  లిఫ్ట్‌ పైభాగంలోకి ఎక్కిమొదటి అంతస్తులోకి వచ్చాడు. శరీరాన్ని సగం బయట, సగం లోపల ఉంచి మరమ్మతు చేపడుతున్నాడు. ఆ సమయంలో లిఫ్ట్‌ పవర్‌ ఆఫ్‌ చేయ లేదు. ఈ విషయం తెలియని నివాసితుల్లో ఎవరో లిఫ్ట్‌ ఆన్‌ చేయడంతో శంకర్‌ శరీరం లిఫ్ట్‌కు, గోడకు మధ్యన ఇరుక్కుపోయింది.

శంకర్‌ అరుపు విని వచ్చిన వాచ్‌మన్‌ లిఫ్ట్‌ను ఆఫ్‌ చేసి పైభాగాన్ని పగులగొట్టి శంకర్‌ను బయటకు తీశారు. అప్పటికే కొన ఊపిరితో ఉన్న అతన్ని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే చనిపోయాడు. మృతునికి భార్య కనకలక్ష్మి, ఒక కుమార్తె, ఇద్దరు కొడుకులు ఉన్నారు. పోలీసులు వరుణ్‌ టవర్స్‌ సంక్షేమ సంఘం సభ్యులపై కేసు నమోదు చేశారు.

More Telugu News