Nairuthi: తెలుగు రాష్ట్రాలకు రుతుపవనాలు... మరో రెండు వారాల తరువాతే!

  • 10 లేదా 11న తెలంగాణకు నైరుతి
  • అధికారులు అప్రమత్తంగా ఉండాలి
  • సమీక్షలో సీఎస్ ఎస్కే జోషి

తెలుగు రాష్ట్రాల రైతాంగం వేయి కళ్లతో ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు జూన్ 10 లేదా 11న తెలంగాణను తాకే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. నిన్న వాతావరణ పరిస్థితులపై సమీక్ష నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వర్షపాత హెచ్చరికలను ఎప్పటికప్పుడు జిల్లాల అధికారులకు పంపాలని సూచించారు.

కంట్రోల్ రూమ్ ద్వారా అన్ని శాఖలూ సమన్వయంతో పనిచేయాలని అన్నారు. రుతుపవనాలు ప్రస్తుతం అండమాన్ లోని కొన్ని ప్రాంతాలకు విస్తరించి వున్నాయన్న వాతావరణ శాఖ అధికారుల సమాచారాన్ని పంచుకున్న ఆయన, మరో రెండువారాల్లో విస్తారంగా వర్షాలకు అవకాశం ఉందని తెలిపారు. రైతులకు అవసరమైన విత్తనాలను అందుబాటులో ఉంచుకోవాలని ఎస్కే జోషి సూచించారు.

ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 195 సంచార బృందాలను ఏర్పాటు చేశామని, ఫ్లడ్ మ్యాప్స్ ఇప్పటికే రూపొందించామని, భారీ వర్షం కురిస్తే విపత్తు నిర్వహణ బృందాలు 24 గంటలూ పని చేస్తాయని అన్నారు. నాలాల పూడికతీత, మ్యాన్ హోల్ మరమ్మతు పనులను 6వ తేదీ నాటికి పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.

More Telugu News