Karnataka Singam: కర్ణాటక 'సింగం' రిజైన్... విధుల నుంచి తప్పుకున్న డీసీపీ అన్నామలై!

  • నిజాయతీ గల ఆఫీసర్ గా పేరు తెచ్చుకున్న అన్నామలై
  • ఉద్యోగానికి రాజీనామా, రాజకీయాల్లో చేరే ఆలోచన
  • ప్రస్తుతానికి ఏ నిర్ణయమూ తీసుకోలేదన్న అన్నామలై
బెంగళూరు సౌత్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ కె.అన్నామలై. ఈ పేరుతో కన్నా 'కర్ణాటక సింగం' అంటే ఆయన్ను ప్రతి ఒక్కరూ గుర్తిస్తారు. సూర్య హీరోగా నటించిన 'సింగం' సినిమా విడుదలై ఘన విజయం సాధించిన తరువాత అన్నామలైకి ఆ పేరు వచ్చింది. ఇక ఆయన తాజాగా తన ఉద్యోగానికి రాజీనామా చేయడం కలకలం రేపింది. రాష్ట్ర హోమ్ మంత్రి ఎంబీ పాటిల్ సమక్షంలో ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామిని కలిసిన అన్నామలై, తాను రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. ప్రజలకు సేవ చేసేందుకు తనకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కుమారస్వామి సైతం అన్నామలై భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.

సీఎంతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన అన్నామలై, తన నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని సీఎం సూచించారని అన్నారు. అయితే, తాను రాజీనామా నిర్ణయాన్ని వెనక్కు తీసుకోలేనని స్పష్టం చేశానని అన్నారు. తానేమీ రాజకీయాల్లో చేరబోవడం లేదని, అసలు తనకా ఆలోచనే లేదని స్పష్టం చేశారు. తాను డ్యూటీ చేసే విషయంలో ప్రస్తుత సీఎంతో పాటు, మాజీ జీఎం సిద్ధరామయ్య పూర్తి స్వేచ్ఛను ఇచ్చారని తెలిపారు.

కాగా, నిజాయతీతో పాటు ధైర్య సాహసాలు కలిగిన పోలీసు అధికారిగా పేరు తెచ్చుకున్న అన్నామలైని కన్నడిగులు ఎంతో అభిమానంతో చూస్తారు. ఉడిపి, చిక్ మగళూరు జిల్లాల్లో ఆయన ఎస్పీగా పని చేస్తున్న వేళ, కొందరు నేతల నుంచి వచ్చిన ఒత్తిళ్లు ఆయన బదిలీలకి కారణమయ్యాయి. గడచిన పదేళ్లుగా తాను ప్రజలకు సేవ చేస్తూ ఉన్నానని, తాను భవిష్యత్తులో ఏం చేయాలన్న విషయమై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆయన అన్నారు. మరో మూడు, నాలుగు నెలల తరువాత ఓ నిర్ణయానికి వస్తానన్నారు. కాగా, ఆయన త్వరలోనే రాజకీయ అరంగేట్రం చేయనున్నారని, బీజేపీలో చేరవచ్చని తెలుస్తోంది.
Karnataka Singam
Annamalai
DCP
Resign
Politics

More Telugu News