Dating: అమ్మాయిలను పంపిస్తామని చెప్పగానే... అడ్డంగా బుక్కయిన హైదరాబాదీ!

  • ప్రభుత్వ ఉద్యోగిని మోసం చేసిన నేరగాళ్లు
  • అమ్మాయిల ఫోటోలు పంపి రూ. 5.45 లక్షలు వసూలు
  • ఆ తరువాతే నిజం తెలుసుకున్న బాధితుడు

అతను హైదరాబాద్ నల్లగండ్ల ప్రాంతంలో నివసించే ప్రభుత్వ ఉద్యోగి. అమ్మాయిలను పంపిస్తామని చెబితే కక్కుర్తితో అడ్డంగా మోసపోయి రూ. 5.45 లక్షలను సమర్పించుకున్న తరువాత అసలు విషయం తెలుసుకుని బోరుమన్నాడు. సైబర్ క్రైమ్ పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల్లోకి వెళితే, ఈనెల 22న బాధితుడికి ఓ డేటింగ్‌ సైట్‌ నుంచి, అమ్మాయిలతో డేటింగ్‌ చేసే అవకాశం కల్పిస్తామంటూ ఫోన్ వచ్చింది. కావాలంటే, వారిని నేరుగా కల్పిస్తామన్నది ఆ ఫోన్ కాల్ సారాంశం. దీన్ని అతను నమ్మాడు.

ఆ వెంటనే రిజిస్ట్రేషన్‌ కోసం రూ. 1,030 చెల్లించాలంటూ ఓ బ్యాంకు ఖాతా నంబరు ఇవ్వగా, డబ్బు పంపాడు. ఆపై రిజిస్ట్రేషన్‌ పూర్తయిందని చెబుతూ కొందరు అమ్మాయిల ఫోటోలను పంపారు. వారిలో నుంచి ఒకరిని ఎంచుకోవాలని నమ్మబలికారు. ఆపై లీగల్‌ అగ్రిమెంట్‌ అంటూ రూ. 19,900, ఐడీ కార్డు ఇస్తున్నామంటూ రూ. 29,900 అడిగితే, బాధితుడు ఆ డబ్బు కూడా ట్రాన్స్ ఫర్ చేశాడు. ఆ తరువాత పోలీస్‌ ప్రొటెక్షన్‌ కార్డు పేరిట రూ. 53వేలు, కన్ఫర్మేషన్‌ కోసమంటూ మరో రూ. 37,500 వసూలు చేశారు.

 ఇలా రెండు రోజుల వ్యవధిలోనే పలు దఫాలుగా రూ. 5.45 లక్షలను నొక్కేశారు.  ఇంత డబ్బూ కట్టాక బాధితుడికి అనుమానం వచ్చి నిలదీయడంతో, ఒప్పందం రద్దు చేసుకోవాలంటే రూ. 65 వేలు కట్టాలని వాళ్లు చెప్పడంతో, తాను అడ్డంగా మోసపోయానని గుర్తించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఈ విషయమై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు.

More Telugu News