Sachin Tendulkar: మా నాన్న నాకు చెప్పాడు, నేను నీకు చెబుతున్నా... కొడుక్కి హితబోధ చేసిన సచిన్ టెండూల్కర్

  • ఎలాంటి మార్గంలో నడవాలో తనయుడికి వివరించిన మాస్టర్ బ్లాస్టర్
  • ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న అర్జున్ టెండూల్కర్
  • ఆల్ రౌండర్ గా ప్రస్థానం ఆరంభించిన అర్జున్

భారత క్రికెట్ రంగంలో సచిన్ టెండూల్కర్ ఓ శిఖరం. ఆయన వారసుడిగా క్రికెట్ మైదానంలో అడుగుపెట్టిన అర్జున్ టెండూల్కర్ పై ఎన్నో అంచనాలు ఉన్నాయి. సచిన్ తనయుడు అర్జున్ వయసు 19 ఏళ్లు. స్వతహాగా ఆల్ రౌండర్ అయిన ఈ లెఫ్ట్ హ్యాండర్ ఇప్పుడిప్పుడే ఆటలో నైపుణ్యం సాధిస్తున్నాడు. అయితే టీనేజ్ వయసుకే సచిన్ సాధించిన ఘనతలు, ప్రతిభతో అర్జున్ ను పోల్చిచూస్తున్న క్రికెట్ పండితులు మాత్రం పెదవి విరుస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఓ తండ్రిగా సచిన్ తన కుమారుడికి ఎల్లవేళలా అండగా నిలుస్తున్నాడు.

తాజాగా, కెరీర్ కు కీలకదశ అయిన ఈ వయసులో తనయుడికి హితబోధ చేశాడు. జీవితంలో కష్టపడి పైకిరావాలే తప్ప విజయం కోసం అడ్డదారుల్లో వెళ్లకూడదని సూచించాడు. "నచ్చినపని చేయడం కోసం సన్మార్గంలోనే పయనించాలి, పక్కదారుల్లో వెళ్లకూడదని చెప్పాను... ఇది మా నాన్న నాకు చెప్పారు, ఇదే విషయాన్ని ఇప్పుడు నా కొడుక్కి చెబుతున్నాను. మొదట్లో అర్జున్ సాకర్ ఆడేవాడు, ఆ తర్వాత చెస్ పై ఆసక్తి పెంచుకున్నాడు. ఇప్పుడతనికి క్రికెటే లోకంగా మారిపోయింది. ఓ తండ్రిగా కొడుకు అభిరుచులను గౌరవిస్తాను" అంటూ వ్యాఖ్యానించాడు.

అర్జున్ టెండూల్కర్ ప్రస్తుతం ముంబయి టి20 క్రికెట్ లీగ్ లో పాల్గొంటున్నాడు. అర్జున్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఆకాశ్ టైగర్స్ జట్టు సెమీస్ కు చేరింది. ఈ సందర్భంగా కొడుకు ప్రాక్టీస్ చేస్తున్న విధానాన్ని సచిన్ దగ్గరుండి పరిశీలించాడు.

More Telugu News