Andhra Pradesh: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా రానున్న స్టీఫెన్ రవీంద్ర?

  • గతంలో వైఎస్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా పనిచేసిన రవీంద్ర
  • ఫ్యాక్షన్, ఉగ్రవాద, మావో ఆపరేషన్లలో విశేష అనుభవం
  • ఏరి కోరి ఎంపిక చేసుకున్న వైఎస్ జగన్

దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా పనిచేసిన ఐజీ స్టీఫెన్ రవీంద్రను కొత్త పోస్ట్ వరించనుంది. వైసీపీ అధినేత, ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి జగన్ విజ్ఞప్తి మేరకు ఆయన్ను తెలంగాణ ప్రభుత్వం రిలీవ్ చేయనున్నట్టు, కేంద్ర హోంశాఖ కూడ ఇందుకు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ఆయనను ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా నియమించనున్నట్టు సమాచారం. గతంలో రాయలసీమలో ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతాలతో పాటు ఉగ్రవాద, మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్లలో స్టీఫెన్ రవీంద్ర పనిచేశారు.

చాలా నిక్కచ్చిగా పనిచేసే అధికారిగా ఆయనకు మంచి పేరుంది. ఈ నేపథ్యంలోనే ఏపీలో పరిస్థితులపై సమగ్ర అవగాహన ఉన్న స్టీఫెన్ రవీంద్రను జగన్ ఏరికోరి ఎంపిక చేసుకున్నట్లు సమాచారం. త్వరలోనే రవీంద్ర ఏపీకి చేరుకుని బాధ్యతలు స్వీకరిస్తారని తెలుస్తోంది. స్టీఫెన్ రవీంద్ర అనంతపురానికి చెందినవారని అధికారిక వర్గాలు తెలిపాయి.

More Telugu News