Andhra Pradesh: 'సోనియా గాంధీ స్వయంగా వచ్చి, జగన్... మన ఇంటికి వచ్చేయ్ అంటే?'... జగన్ సమాధానం ఇది!

  • పదేళ్ల క్రితం కాంగ్రెస్ నేతగా వైఎస్ జగన్
  • ఆపై కాంగ్రెస్ ను వీడి సొంత పార్టీ
  • తన అవసరం ఉంటే, అది కాంగ్రెస్ సమస్యే
  • ఏపీలో కాంగ్రెస్ పార్టీయే లేదన్న జగన్

వైఎస్ జగన్... పదేళ్ల క్రితం కాంగ్రెస్ నేత. తన తండ్రి సీఎంగా పనిచేస్తుంటే, పార్లమెంట్ లో ఏపీ గొంతుకను వినిపించిన వ్యక్తి. ఆపై జరిగిన పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ ను వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి, ఇప్పుడు ఏపీకి సీఎంగా పదవీ బాధ్యతలను తీసుకోనున్నారు. ఈ నేపథ్యంలో నిన్న ఢిల్లీకి వెళ్లిన ఆయన్ను జాతీయ మీడియా ప్రత్యేక ఇంటర్వ్యూ చేసిన వేళ, ఓ ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది.

'ఇండియా టుడే' ప్రతినిధి రాజ్ దీప్ సర్దేశాయ్, జగన్ ను ఇంటర్వ్యూచేస్తూ, "ఒకవేళ ఇవాళ సోనియా గాంధీ మీ వద్దకు వచ్చి, మళ్లీ మన ఇంటికి వచ్చేయ్‌. మీ తండ్రి మా కాంగ్రెస్‌ వారే అని ఆహ్వానిస్తే ఎలా స్పందిస్తారు?" అని అడిగారు. దీనికి జగన్ సమాధానం ఇస్తూ, "మీరే అన్నారు... కాంగ్రెస్‌ కు చాలా తక్కువ ఓట్లు వచ్చాయని. ఆంధ్రప్రదేశ్‌ లో కాంగ్రెస్‌ పార్టీ ఎక్కడుంది? వారితో నాకు అవసరం ఏమిటి?" అని అన్నారు. ఆపై సర్దేశాయ్ మీకు వాళ్ల అవసరం లేదు కానీ, వాళ్లకు మీ అవసరం ఉంది అని అనగా, కాంగ్రెస్ పార్టీకి తన అవసరం ఉందంటే అది వారి సమస్యేనని జగన్ వ్యాఖ్యానించడం గమనార్హం.

More Telugu News