Kurnool District: వలసలు మొదలు ... టీడీపీ నుంచి వైసీపీలోకి కప్పట్రాళ్ల కుటుంబీకులు!

  • కర్నూలు జిల్లాలో వలసలు మొదలు
  • స్థానిక నేతల అభిప్రాయాలు తీసుకోకుండా టికెట్లు
  • అందుకే తెలుగుదేశం ఓడిపోయిందన్న కప్పట్రాళ్ల రామచంద్రనాయుడు
ఎన్నికలు అలా ముగిసి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలా ఘన విజయం సాధించగానే, కర్నూలు జిల్లాలో తెలుగుదేశం నుంచి వైసీపీలోకి వలసలు ప్రారంభం అయ్యాయి. కర్నూలు జిల్లా దేవనకొండ, ఆలూరు ప్రాంతంలో పలువురు వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. కప్పట్రాళ్ల వెంకటప్పనాయుడి కుమార్తె, ఆస్పరి జడ్పీటీసీ సభ్యురాలు కప్పట్రాళ్ల బొజ్జమ్మ, ఆమె భర్త, దేవనకొండ ఎంపీపీ రామచంద్రనాయుడు స్వయంగా ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంను కలిసి, విజయం సాధించినందుకు శుభాకాంక్షలు తెలిపి సన్మానించారు.

పార్టీ నేతల అభిప్రాయాలు తీసుకోకుండానే తెలుగుదేశం అధిష్ఠానం టికెట్లను కేటాయించిందని, అందువల్లే అభ్యర్థులు ఓడిపోతున్నారని వారు ఆరోపించారు. వాల్మీకులు అత్యధికంగా ఉన్న నియోజకవర్గంలో అగ్రవర్ణాల వారికి టికెట్‌ ఇచ్చారని ఆరోపించిన రామచంద్రనాయుడు, తమ ప్రాంతంలో ఫ్యాక్షన్‌ కారణంగా ఎందరినో పోగొట్టుకున్నామని గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీ విధానాలు నచ్చడం లేదని, త్వరలోనే ఎమ్మెల్యే ఆధ్వర్యంలో జగన్‌ సమక్షంలో వైసీపీలో చేరుతామని ప్రకటించారు. తమ కుటుంబం మూడు దశాబ్దాలుగా టీడీపీలో కొనసాగుతోందని, అయినా తమకు గుర్తింపు లేకపోయిందని వారు వ్యాఖ్యానించారు.
Kurnool District
Telugudesam
YSRCP
Kappatralla

More Telugu News