Andhra Pradesh: గెలిచాక జగన్ కళ్లలో గర్వం లేదు.. ఒంటరిగా ఏడ్చిన కన్నీళ్లు కనిపించాయి!: దర్శకుడు పూరీ జగన్నాథ్

  • జగన్ ప్రెస్మీట్ ను టీవీలో చూశా
  • నిజంగా రాజన్న కొడుకు అనిపించాడు
  • ప్రజలు జగన్ ను దేవుడిని చేసేశారు
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన జగన్ పై ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా పూరి స్పందిస్తూ ఫలితాల వెల్లడి అనంతరం జగన్ మీడియా సమావేశాన్ని తాను టీవీలో చూశానని తెలిపారు. ‘జగన్ మొహంలో విజయగర్వం లేదు. ఇన్ని తలలు నరికాను అన్న పొగరు లేదు. కామ్ గా ఉన్నాడు. సేద తీర్చుకుంటున్నాడు.

జగన్ ముఖంలో గెలుచుకున్న సీఎం పదవి కంటే ఆయనకు పొడిచిన వెన్నుపోట్లే కనిపించాయి. ఒంటరిగా ఎన్నోసార్లు ఏడ్చిన కన్నీళ్లు కనిపించాయి. వాళ్లింట ఆడవాళ్ల వేదనలు కనిపించాయి. ఏది ఏమయినా రాజన్న కొడుకు అనిపించాడు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఓ యోధుడు. ఎన్నికల్లో విజయం తర్వాత ప్రజా నిర్ణయం, దైవ నిర్ణయం కారణంగా ఈ విజయం వచ్చిందని జగన్ చెప్పాడు.

నిజానికి దైవ నిర్ణయం కంటే ప్రజా నిర్ణయం గొప్పదని నేను నమ్ముతాను. ప్రజలను మార్చడంలో దేవుడు ఎప్పుడో ఫెయిల్ అయ్యాడు. కానీ ప్రజలు దేవుళ్లను మార్చగలరు. ఇన్ని కోట్ల మంది చేతులు ఎత్తి ఎవరికి మొక్కితే వాళ్లే దేవుడు. అందరూ కలిసి జగన్ గారికి ఈరోజు మొక్కేశారు’ అని పూరీ జగన్నాథ్ చెప్పారు.
Andhra Pradesh
YSRCP
Jagan
Tollywood
Puri Jagannadh

More Telugu News