Andhra Pradesh: విజయవాడ పోలీసుల నోటీసులు.. మనసు మార్చుకున్న రామ్ గోపాల్ వర్మ

  • పైపుల రోడ్డులో ప్రెస్మీట్ వద్దన్న పోలీసులు
  • అత్యవసర సేవలకు ఇబ్బందని వ్యాఖ్య
  • వెనక్కి తగ్గిన వర్మ.. మరోచోట ప్రెస్మీట్ కు ఏర్పాట్లు
ఈరోజు విజయవాడలోని పైపుల రోడ్డు సెంటర్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేస్తానని ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందుకోసం మరికాసేపట్లో వర్మ ముంబై నుంచి విజయవాడకు చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడ నగర పోలీసులు రామ్ గోపాల్ వర్మకు నోటీసులు జారీచేశారు.

ఓవైపు గ్రూప్ 1 ప్రిలిమనరీ పరీక్షలు జరుగుతున్నాయనీ, మరోవైపు వర్మ మీడియా సమావేశం కారణంగా అత్యవసర సేవలకు ఇబ్బంది తలెత్తే ప్రమాదముందని అందులో తెలిపారు. కాబట్టి మీడియా సమావేశాన్ని ఏదైనా ప్రెస్ క్లబ్ లేదా హాల్ కు మార్చుకోవాలని సూచించారు. ప్రస్తుతం నగరంలో 144 సెక్షన్, పోలీస్ చట్టంలోని సెక్షన్ 30 అమలవుతున్న విషయాన్ని అందులో ప్రస్తావించారు.

పోలీస్ నోటీసుల నేపథ్యంలో వర్మ తన మనసును మార్చుకున్నారు. విజయవాడలోని గాంధీనగర్ లో ఉన్న ఫిల్మ్ ఛాంబర్ లో మీడియా సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. మరికాసేపట్లో గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకోనున్న వర్మ మీడియాతో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా  విడుదలపై మాట్లాడనున్నారు.
Andhra Pradesh
Vijayawada
YSRCP
RGV

More Telugu News