Andhra Pradesh: జగన్ మా విద్యార్థే.. ఇక్కడే బీకామ్ చదువుకున్నాడు!: ప్రగతి మహా విద్యాలయ

  • 1991-94లో జగన్ బీకామ్ పూర్తి
  • లైబ్రరీలో ఎక్కువసేపు జగన్ గడిపేవారు
  • కాలేజీ ప్రిన్సిపల్ వై.కృష్ణమోహన్ నాయుడు వెల్లడి

వైసీపీ అధినేత, ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తమ కాలేజీలోనే బీకామ్ చదువుకున్నాడని ప్రగతి మహావిద్యాలయ డిగ్రీ, పీజీ కళాశాల యాజమాన్యం తెలిపింది. 1991-94 మధ్యకాలంలో దేశంలోనే రెండో కామర్స్ కాలేజీగా పేరుగాంచిన తమ విద్యాసంస్థలో జగన్ బీకామ్ చదివారని వెల్లడించింది. ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్న జగన్ కు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపింది. కాగా, జగన్ ఏపీ సీఎం కానున్న నేపథ్యంలో ప్రగతి మహా విద్యాలయలో పండుగ వాతావరణం నెలకొంది.

కాలేజీ యాజమాన్యం విద్యార్థులు, అధ్యాపకులకు మిఠాయిలు పంచింది. ఈ సందర్భంగా కాలేజీ ప్రిన్సిపాల్ వై.కృష్ణమోహన్ నాయుడు మాట్లాడుతూ.. జగన్ ఎక్కువగా లైబ్రరీలో గడిపేవారని తెలిపారు. ఆయన బీకామ్ లో మంచిమార్కులతో పాసయ్యారనీ, అప్పట్లో ప్రిన్సిపల్ గా ప్రొ.వేదాచలం ఉండేవారని గుర్తుచేసుకున్నారు. ఆయన క్రమశిక్షణతో 1991 బ్యాచ్ లో చాలామంది విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదిగారని వ్యాఖ్యానించారు. ఇప్పుడు జగన్ ఏపీ ముఖ్యమంత్రి కానుండటం నిజంగా తమకు గర్వంగా ఉందన్నారు.

More Telugu News