Actress Madhavi latha: పవన్ ఓటమి బాధించింది.. నిజాయతీపరులు వద్దని భలే చెప్పారుగా: నటి మాధవీలత ఆవేదన

  • గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి బరిలోకి
  • డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయిన నటి
  • డబ్బుకే పట్టం కట్టారని ఆరోపణ

ఈ ఎన్నికల్లో తాను గెలుస్తానన్న ఆశలు పెట్టుకోలేదని, గెలుస్తానని కూడా ఎప్పుడూ చెప్పలేదన్న నటి మాధవీలత.. జనసేన చీఫ్ పవన్ ఓటమి తనను తీవ్రంగా బాధించిందని పేర్కొన్నారు. ఏపీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి బీజేపీ టికెట్‌పై పోటీ చేసిన మాధవీలత ఓటమి పాలయ్యారు. 1989 ఓట్లు మాత్రమే పోలవడంతో ఆమె డిపాజిట్ కోల్పోయారు. ఓటమి అనంతరం నటి తన ఫేస్‌బుక్ ఖాతా ద్వారా స్పందించారు.  

తన ఓటమిని ముందే ఊహించానని పేర్కొన్న మాధవీలత.. పవన్ ఓటమి మాత్రం తనను బాధించిందని పేర్కొన్నారు. మోదీ మళ్లీ అధికారంలోకి రావాలని కోరుకున్నానని, జరిగిందని అన్నారు. అయితే, పవన్ కల్యాణ్ ఓటమే తనకు విడ్డూరంగా అనిపించిందన్నారు. పవన్‌ను ఓడించి తమకు నిజాయతీపరులు అవసరం లేదని భలే తీర్పు ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులకే పట్టం కట్టారని తీవ్ర ఆరోపణలు చేశారు. బీజేపీ డబ్బులు ఇవ్వకున్నా మోదీ ప్రేమతో ఓట్లు సంపాదించారని అన్నారు. పవన్ ఎందుకు గెలవలేదని, ఆయన అభిమానులకు ఏమైందని ప్రశ్నించారు.

More Telugu News