TV9: ఎన్సీఎల్టీలో రవిప్రకాశ్, శివాజీలకు మరోసారి చుక్కెదురు

  • పిటిషన్ కొట్టివేసిన ఎన్సీఎల్టీ
  • మారిషస్ సంస్థ వ్యాజ్యాన్ని కొనసాగించాలంటూ రవిప్రకాశ్ విజ్ఞప్తి
  • కుదరదని స్పష్టం చేసిన ట్రైబ్యునల్

టీవీ9 చానల్ మాజీ సీఈవో రవిప్రకాశ్, నటుడు శివాజీలకు మరోసారి ఎన్సీఎల్టీ (నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్)లో చుక్కెదురైంది. మారిషస్ కు చెందిన సైఫ్3 అనే సంస్థ దాఖలుచేసిన వ్యాజ్యాన్ని వాపసు తీసుకునేందుకు అనుమతించవద్దంటూ రవిప్రకాశ్, శివాజీ వేసిన పిటిషన్లను ఎన్సీఎల్టీ తోసిపుచ్చింది.

మారిషస్ కు చెందిన సైఫ్3 అనే సంస్థ గతంలో ఏబీసీఎల్, ఐవిజన్ మీడియా తదితర సంస్థలకు ఓ ఒప్పందంలో భాగంగా రూ.50 కోట్లు చెల్లించింది. అయితే, వివాదం రేగడంతో తమ డబ్బు తిరిగి ఇచ్చేయాలంటూ సైఫ్3 ఎన్సీఎల్టీలో ఆయా సంస్థలపై కేసు దాఖలు చేసింది. దీనిపై విచారణ జరుగుతున్న సమయంలోనే రాజీ కుదరడంతో సదరు సంస్థలు మారిషస్ కంపెనీ సైఫ్3కి రూ.50 కోట్లను తిరిగిచ్చేశాయి.

దాంతో, తమ సమస్య పరిష్కారం అయిందని, తాము గతంలో నమోదు చేసిన కేసును వాపసు తీసుకోవడానికి అనుమతించాలంటూ సైఫ్3 ఎన్సీఎల్టీలో పిటిషన్ వేసింది. అయితే, దీనికి రవిప్రకాశ్ అభ్యంతరం చెప్పారు. ఇందులో తమ ప్రయోజనాలు కూడా ఇమిడి ఉన్నాయని, తమ విషయం కూడా ఓ కొలిక్కి వచ్చేంతవరకు కేసు ఉపసంహరించుకునేందుకు సైఫ్3కి అనుమతి ఇవ్వరాదని రవిప్రకాశ్ ఎన్సీఎల్టీలో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, ఎన్సీఎల్టీ రవిప్రకాశ్ పిటిషన్ ను తిరస్కరించింది.

గతంలో ఫిర్యాదుచేసిన సంస్థ, ప్రతివాదులు రాజీ కుదుర్చుకున్నందున, ఈ కేసును తాము కొనసాగించలేమంటూ స్పష్టం చేసింది. కాగా, ఇదే వ్యవహారంలో రవిప్రకాశ్ వేసిన పిటిషన్ కు అనుబంధంగా నటుడు శివాజీ కూడా పిటిషన్ దాఖలు చేయడం గమనార్హం. అతడి పిటిషన్ కు సైతం తిరస్కరణ తప్పలేదు.

More Telugu News