Posani Krishna Murali: పవన్ కల్యాణ్ పతనం ఆనాడే మొదలైంది: పోసాని సంచలన వ్యాఖ్యలు

  • సీనియర్ అంటూ చంద్రబాబును కలిసి తప్పు చేశారు
  • డ్యామేజ్ ఉన్న వ్యక్తితో కలవడం ఏంటి?
  • అందుకే ఇంత ఎదురుదెబ్బన్న పోసాని కృష్ణమురళి

ఎప్పుడైతే పవన్ కల్యాణ్, చంద్రబాబును కలిశారో, ఆనాడే అతని రాజకీయ జీవితం పతనం కావడం ప్రారంభమైందని నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరుగుతోందని రాజకీయాల్లోకి వచ్చిన పవన్, అప్పటికే డ్యామేజ్ ఉన్న వ్యక్తిని, సీనియర్ అంటూ సపోర్ట్ చేయడాన్ని ప్రజలు ఎలా హర్షిస్తారని ప్రశ్నించారు. పవన్ స్ట్రయిట్ గా రాజకీయాల్లోకి వచ్చి ఉండాల్సిందని, చంద్రబాబును సపోర్ట్ చేయగానే పవన్ ఆయుషు సగం తగ్గిపోయిందని అన్నారు.

రాజకీయాల పట్ల అవగాహన ఉన్న పవన్ చేసిన పెద్ద తప్పు ఇదేనని పోసాని అభిప్రాయపడ్డారు. అవినీతిపరుల పంచెలూడదీసి కొట్టాలని ఒకప్పుడు వ్యాఖ్యానించిన పవన్, అదే అవినీతి మురికిని అంటించుకున్న చంద్రబాబును సపోర్ట్ చేశాడని విమర్శించారు. వంటవాళ్లకు, కారు డ్రైవర్లకు అనుభవం, సీనియారిటీ ఉండాలే తప్ప, రాజకీయాలకు కాదని, రాజకీయాలకు కావాల్సింది నిజాయితీయేనని, ఈ విషయాన్ని పవన్ మరచిపోయి, చంద్రబాబుకు సీనియారిటీ ఉందని ఆయన పక్కన చేరారని, అదే కొంపముంచిందని అన్నారు.

ఎన్టీఆర్ కు ఏ సీనియారిటీ ఉందని సీఎం అయ్యారని, ఈ విషయాలను తాను ఓ సోదరుడిగా పవన్ కు గుర్తు చేస్తున్నానని చెప్పారు. ఈ ఎన్నికల్లో పవన్ కు ఇంత ఎదురుదెబ్బ తగలడానికి కారణం చంద్రబాబుతో కలవడమేనని, ఆ పని చేయకుంటే, ఇప్పుడు రాష్ట్రంలో పవన్ థర్డ్ ఫోర్స్ అయ్యుండేవారని పోసాని అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News