Arunachal Pradesh: ఎన్నికల సిబ్బందిపై దాడి చేసిన 500 మంది ముసుగు మనుషులు.. ఈవీఎంలు ఎత్తుకెళ్లిన వైనం!

  • రీపోలింగ్ కోసం ఈవీఎంలతో బయలుదేరిన సిబ్బంది
  • దుండగుల వద్ద ఏకే-47 వంటి ఆయుధాలు
  • పలు రౌండ్ల కాల్పులు

అరుణాచల్ ప్రదేశ్‌లో ఘోరం జరిగింది. దాదాపు 500 మంది ముసుగు మనుషులు తుపాకులతో ఎన్నికల సిబ్బందిని అడ్డుకున్నారు. వారిపై దాడిచేసి ఈవీఎంలను లాక్కుని ఎత్తుకెళ్లారు. ఆదివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కురుంగ్ కుమీ జిల్లాలోని నంపేలో జరిగిందీ ఘటన. మంగళవారం ఇక్కడ రీపోలింగ్ ఉండడంతో ఆదివారం ఎన్నికల సిబ్బంది ఈవీఎంలతో బయలుదేరారు.

మార్గమధ్యంలో వీరిని అటకాయించిన గుర్తుతెలియని ముసుగు ధరించిన వ్యక్తులు వారిపై దాడిచేశారు. అనంతరం ఈవీఎంలు లాక్కుని పరారయ్యారు. విషయం వెలుగులోకి వచ్చిన వెంటనే అప్రమత్తమైన ఎన్నికల అధికారులు సోమవారం ఆ గ్రామానికి మరో ఎన్నికల బృందాన్ని పంపించారు. దీంతో మంగళవారం యథావిధిగా రీపోలింగ్ జరిగింది.  

నిందితులు నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పీపీ)కి చెందిన వారని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వ కూటమిలో ఎన్‌పీపీ కూడా ఉండడం గమనార్హం. ఎన్నికల అధికారులను అడ్డగించిన దుండగుల వద్ద ఏకే-47 వంటి అత్యాధునిక ఆయుధాలు ఉన్నాయని, పలు రౌండ్లు కాల్పులు జరిపి బీభత్సం సృష్టించారని తెలిపారు. అయితే, ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News