Narendra Modi: మోదీ గెలిస్తే ఊరు వదిలి వెళ్లిపోతాం.. యూపీలో ముస్లిం కుటుంబాల్లో ఆందోళన!

  • మా ఊరిలో హిందువులు, ముస్లింలు విడిపోయారు
  • ఇప్పటికే చాలామంది ఊరు వదిలి వెళ్లిపోయారు
  • మోదీ విజయంపై నయాబన్స్ ముస్లింలలో కలవరం

సార్వత్రిక ఎన్నికల వేళ ప్రధాని మోదీ  నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వానికి మెజారిటీ వస్తుందని చాలా ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ లోని నయాబన్స్ గ్రామంలో ముస్లింలు భయంతో వణికిపోతున్నారు. బులంద్ షహర్ జిల్లాలోని నయాబన్స్ గ్రామంలో గతేడాది హింసాత్మక ఘటనలు జరిగాయి. ఈ దుర్ఘటనలో ఓ అధికారి, మరో పౌరుడు ప్రాణాలు కోల్పోయారు. అంతేకాకుండా గ్రామంలో ప్రజలు హిందువులు, ముస్లింలుగా విడిపోయారు. దీంతో ఈసారి మోదీ  గెలిస్తే తాము ఊరి విడిచిపెట్టి వెళ్లిపోతామని చాలా మంది ముస్లింలు చెబుతున్నారు.

ఈ విషయమై గ్రామస్తుడు ఒకరు మాట్లాడుతూ.. ‘ఒకప్పుడు ముస్లిం, హిందూ పిల్లలు కలిసి ఆడుకునేవారు. పండుగలను కూడా కలిసే జరుపుకునేవాళ్లం. ఊరిలో ఎవరికైనా ఇబ్బంది వస్తే అందరం తోడుగా నిలిచేవాళ్లం. కానీ ఎప్పుడైతే బీజేపీ అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి పరిస్థితులు మారిపోయాయి. హిందూ-ముస్లింల మధ్య అనుబంధం క్రమంగా తగ్గడం ప్రారంభమైంది.

ఎప్పుడైతే యోగి ముఖ్యమంత్రి అయ్యారో పరిస్థితులు మరింతగా దిగజారాయి. హిందూ-ముస్లింలను విడదీయడమే ఆయన అజెండాగా పెట్టుకున్నారు. ఊరిలో 4,000 మంది ఉంటే మా సంఖ్య 400 మాత్రమే. ప్రస్తుతమున్న ఉద్రిక్త పరిస్థితుల్లో ఊరిలో ఉండటం మంచిది కాదనిపిస్తోంది. ఆర్థిక స్తోమత ఉన్న కుటుంబాలు ఇప్పటికే ఊరు విడిచిపెట్టి వెళ్లిపోయాయి. ఈసారి కూడా బీజేపీ గెలిస్తే మిగిలిన కుటుంబాలు కూడా ఊరు విడిచిపెట్టి వెళతాయి’ అని స్పష్టం చేశారు.

More Telugu News