Amaravati: హీట్ పుట్టిస్తున్న డెసిషన్ డే... అమరావతికి నేతల క్యూ!

  • రేపు ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్
  • మధ్యాహ్నానికి తేలిపోనున్న లెక్కలు
  • ప్రధాన పార్టీల నేతల మకాం అమరావతిలోనే

మరో 24 గంటలు వేచి చూస్తే చాలు... నేతలందరిలో, ప్రజల్లో ఉన్న ఉత్కంఠ తొలగిపోతుంది. రేపు మధ్యాహ్నం ఒంటిగంట సమయానికి కౌంటింగ్ ట్రెండ్స్ తెలిసిపోతాయి. చంద్రబాబు సర్కారు ప్రభుత్వాన్ని నిలుపుకుంటుందా? వైసీపీ అధినేత జగన్ అధికారాన్ని కైవసం చేసుకోనున్నారా? జనసేన కింగ్ మేకర్ అయ్యేనా? వంటి ప్రశ్నలకు సమాధానం లభిస్తుంది. గురువారం నాడు ఏపీలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు 25 లోక్ సభ నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల కౌంటింగ్, 30కిపైగా పట్టణాల్లో ఏర్పాటు చేసిన సెంటర్లలో జరగనుంది. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది.

డెసిషన్ డే రాజకీయ పార్టీల్లో హీట్ పుట్టిస్తున్న వేళ, ప్రధాన పార్టీల నేతలంతా అమరావతికి క్యూ కట్టారు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఇప్పటికే విజయవాడకు చేరుకుని, సమీక్షలు నిర్వహిస్తుండగా, సాయంత్రానికి వైఎస్ జగన్ తాడేపల్లికి చేరుకోనున్నారు. కుప్పం గంగమ్మ జాతర సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, రేణిగుంటకు చేరుకోనున్న చంద్రబాబు, అక్కడి నుంచి బెంగళూరు వెళ్లి తిరిగి రాత్రికి అమరావతికి రానున్నారు. ఓట్ల లెక్కింపునకు మరికొన్ని గంటల సమయం మాత్రమే మిగిలివుండటంతో ఏపీలో రాజకీయ వేడి ఇప్పుడు అమరావతికి మారింది.

More Telugu News