Ayyanna Patrudu: ఏంటిది? వారు ఫోన్ తీసుకెళ్లొచ్చు.. మేం తీసుకెళ్లకూడదా?: ఈసీ రూల్స్ పై అయ్యన్న పాత్రుడు ఫైర్

  • టీడీపీకి 110 అసెంబ్లీ, 18 లోక్‌సభ సీట్లు వస్తాయి
  • కేంద్ర పరిశీలకుడికి మాత్రమే ఫోన్ ఎలా అనుమతిస్తారు?
  • ఎగ్జిట్ పోల్స్ వల్ల ప్రాణాలు పోతాయి

ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 110 అసెంబ్లీ, 18 లోక్‌సభ సీట్లను గెలుచుకుంటుందని మంత్రి అయ్యన్నపాత్రుడు ధీమా వ్యక్తం చేశారు. విశాఖపట్టణం జిల్లా నర్సీపట్నంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల సంఘంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈసీ నిర్ణయాలు ఏకపక్షంగా ఉన్నాయని ధ్వజమెత్తారు. అభ్యర్థులు సహా ఎవరూ కౌంటింగ్ కేంద్రంలోకి ఫోన్ తీసుకెళ్లకూడదని ఈసీ ఆదేశించిందని పేర్కొన్న మంత్రి.. కేంద్రం నుంచి వచ్చిన ఎన్నికల పరిశీలకుడికి మాత్రం ఈ విషయంలో మినహాయింపు ఎందుకని సూటిగా ప్రశ్నించారు. అతడికి మాత్రమే ఫోన్ తీసుకెళ్లే అవకాశం ఎందుకిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రం నుంచి, మోదీ నుంచి వచ్చే ఆదేశాలను అమలు చేయడానికా? లేక ప్రతీ గంటకూ ఇక్కడి పరిస్థితిని కేంద్రానికి వివరించడానికా? అని నిలదీశారు.

ఎగ్జిట్‌పోల్స్ సర్వేలపైనా అయ్యన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎగ్జిట్ పోల్స్ వల్ల బలహీన మనస్కులు ఆత్మహత్యలకు పాల్పడే అవకాశం ఉందన్నారు. వీటి వల్ల చాలామంది పందేలు కాసి నష్టపోతుంటారని, వాస్తవ ఫలితాల్లో ఏమాత్రం అటూ ఇటూ అయినా తట్టుకోలేక ప్రాణాలు తీసుకుంటారని మంత్రి అయ్యన్న అన్నారు.

More Telugu News