Andhra Pradesh: ఏపీఎస్సార్టీసీ కార్మిక సంఘాలతో చర్చలు విఫలం.. మోగనున్న సమ్మె గంట!

  • కార్మికుల డిమాండ్లను వెంటనే పరిష్కరించలేం
  • నిధులు రాగానే వేతన సవరణ బకాయిలు చెల్లిస్తాం
  • అప్పటి వరకు సమ్మె యోచన విరమించుకోవాలి: ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబు

ఏపీఎస్సార్టీసీ కార్మిక సంఘాల ఐకాస సహా ఎంప్లాయీస్ యూనియన్ తో యాజమాన్యం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. సంస్థకు ఆర్థిక ఇబ్బందుల వల్ల కార్మికుల డిమాండ్లను వెంటనే పరిష్కరించలేమని ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబు స్పష్టం చేశారు. ప్రభుత్వం నుంచి నిధులు రాగానే వేతన సవరణ బకాయిలు చెల్లిస్తామని, అప్పటి వరకు సమ్మె యోచన విరమించుకోవాలని ఈయూ సహా ఐకాసకు విజ్ఞప్తి చేశారు.

ఈ విజ్ఞప్తిపై ఐకాస నేతలు స్పందిస్తూ, తమ డిమాండ్ల సాధనకు ఇప్పటికే తీవ్ర జాప్యం జరిగినందున ఆందోళన విరమించబోమని స్పష్టం చేశారు. వేతన సవరణ బకాయిలు సహా 27 డిమాండ్లపై స్పష్టమైన హామీ రాలేదని అన్నారు. సత్వరం తమ డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మెకు దిగుతామని, రేపు ఉదయం పదకొండు గంటలకు సమావేశమై సమ్మె తేదీ ప్రకటిస్తామని ఐకాస నేత దామోదర్ పేర్కొన్నారు.

More Telugu News