Kumara Swamy: మీడియాలో వచ్చే కథనాలను చూస్తే నాకు నిద్ర కూడా పట్టదేమో!: కర్ణాటక సీఎం ఫైర్

  • ఎన్ని వ్యంగ్యాస్త్రాలు సంధించినా పడి ఉండాలా?
  • ఏది పడితే అది రాయడానికి అధికారం ఎవరిచ్చారు?
  • మీడియాకు నేనేమాత్రం భయపడను
  • ప్రభుత్వాన్ని కూలదోయడం అంత ఈజీ కాదు

కర్ణాటకలో జేడీ(ఎస్‌)- కాంగ్రెస్‌ కూటమి ప్రభుత్వానికి కాలం చెల్లబోతోందంటూ స్థానిక మీడియా కథనాలు రాసింది. దీనిపై కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి మీడియాపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. తమ ప్రభుత్వం పట్ల ప్రజల్లో అనుమానాలు రేకెత్తించమని ఎవరు చెబుతున్నారని, మీ వెనుక ఎవరున్నారో చెప్పాలంటూ నిలదీశారు. నేడు ఆయన మీడియాను ఉద్దేశించి మాట్లాడుతూ, రాజకీయ నాయకుల గురించి ఏమనుకుంటున్నారంటూ మండిపడ్డారు. ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చిన కథనాలను చూస్తే తనకు నిద్ర కూడా పట్టదేమో అని వ్యాఖ్యానించారు.

మీరెన్ని వ్యంగ్యాస్త్రాలు సంధించినా పడి ఉంటారని భావిస్తున్నారా? ఏది పడితే అది రాసేందుకు ఎవరు అధికారం ఇచ్చారంటూ కుమారస్వామి ధ్వజమెత్తారు. అసలు ఇలాంటి కథనాలన్నింటినీ చూస్తుంటే వాటిని నియంత్రించేందుకు ఓ చట్టం తీసుకురావాలనిపిస్తోందన్నారు. తాము 6.5 కోట్ల ప్రజల ఆశీస్సులతో మనుగడ సాగిస్తున్నామని, మీడియాలో ఆదరణతో బతకడం లేదంటూ ఫైర్ అయ్యారు. తాను ఏ మాత్రం మీడియాను లెక్క చేయనని, భయపడనని స్పష్టం చేశారు. తమకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సిద్ధరామయ్యల అండ ఉందని, తమ ప్రభుత్వాన్ని కూలదోయడం అంత సులువేం కాదని కుమారస్వామి తెలిపారు.

More Telugu News