Andhra Pradesh: నేను టెక్నాలజీలో చాలా స్ట్రాంగ్.. వీవీప్యాట్ స్లిప్పును ఓటర్ సరిచూసుకునేలా కొత్త విధానం తేవాలి!: సీఎం చంద్రబాబు

  • నేను సిద్ధాంతపరంగానే పోరాడుతున్నాను
  • టెక్నాలజీకి మనం బానిసలు అయిపోకూడదు
  • అమరావతిలో మీడియాతో టీడీపీ అధినేత
తాను సిద్ధాంతరపరంగానే మొదటినుంచి పోరాటం చేస్తున్నానని ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. ‘నేను టెక్నాలజీలో చాలా స్ట్రాంగ్ గా ఉన్నాను. అదే సమయంలో టెక్నాలజీలోనూ కొన్ని సమస్యలు ఉన్నాయి. టెక్నాలజీకి మనం మాస్టర్ కావాలే తప్ప దానికి బానిసైపోకూడదు. అందుకే దేశంలోనే తొలిసారి సైబర్ సెక్యూరిటీ వింగ్ ను ఏపీలో ఏర్పాటుచేశాం. నేరాలన్నింటిని కంట్రోల్ చేస్తున్నాం’ అని చంద్రబాబు చెప్పారు. అమరావతిలో ఈరోజు ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు.

ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం) విషయంలో తాను చేసిన పోరాటాన్ని అప్పటి కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ ఖురేషీ గుర్తుంచుకున్నారని చంద్రబాబు తెలిపారు. ఆ విషయాన్నే నిన్న ఢిల్లీలో జరిగిన సదస్సులో ఖురేషీ ప్రస్తావించారని చెప్పారు. ‘ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చన్న ఉద్దేశంతో పేపర్ బ్యాలెట్ కు పోవాలని మేం డిమాండ్ చేశాం. కానీ ఈసీ మాత్రం మధ్యేమార్గంగా వీవీప్యాట్ లను ఎంచుకుంది. వీవీప్యాట్ ఒరిజనల్ ఐడియా ఏంటంటే ఓటు వేశాక ఎవరికి ఓటు పడిందో తెలుసుకునే స్లిప్పు ఓటర్ చేతిలోకి రావాలి. అనంతరం దాన్ని సదరు ఓటర్ బ్యాలెట్ బాక్సులో వేయాలి.

కానీ ఇప్పుడు ఓటు ఎవరికి వేశామో తెలీదు, ఎవరికి పడిందో తెలీదు. ఏడు సెకండ్లు ఉండాల్సిన వీవీప్యాట్ స్లిప్పు కేవలం మూడు సెకన్లలోపే బాక్సులో పడిపోయింది’ అని చంద్రబాబు  వ్యాఖ్యానించారు. ఇప్పుడు వీవీప్యాట్ స్లిప్పును ఓటర్ సరిచూసుకుని బ్యాలెట్ బాక్సులో వేసేలా విధానం తీసుకురావాలని తాము కోరుతున్నామనీ, ఇందులో అభ్యంతరం ఏముందని చంద్రబాబు ప్రశ్నించారు. ఇందుకోసం ప్రస్తుతమున్న పద్ధతిని మార్చాల్సిన అవసరం కూడా ఉండదని అభిప్రాయపడ్డారు. దీనివల్ల ఎన్నికల వ్యవస్థలో పారదర్శకత వస్తుందని చెప్పారు.
Andhra Pradesh
Chandrababu
Telugudesam
vvpat
evm

More Telugu News