Rallapalli: రాళ్లపల్లి నాకు దూరపు బంధువు కూడా: కోట శ్రీనివాసరావు

  • ఆయనతో 40 ఏళ్ల అనుబంధం ఉంది
  • రాళ్లపల్లి రాసిన నాటకంతో ఎంతో గుర్తింపు తెచ్చుకున్నా
  • అందరూ బాగుండాలనుకునే వ్యక్తి ఆయన
టాలీవుడ్ సీనియర్ నటుడు రాళ్లపల్లి మరణంతో సినీ ప్రముఖులు విషాదంలో కూరుకుపోయారు. ఆయనతో ఎంతో అనుబంధం ఉన్న కోట శ్రీనివాసరావు కూడా తీవ్ర భావోద్వేగాలకు లోనయ్యారు. రాళ్లపల్లితో తనది 40 ఏళ్ల అనుబంధం అని, ఇద్దరి మధ్య దూరపు చుట్టరికం కూడా ఉందని వెల్లడించారు. అంతకుమించి మంచి స్నేహితుడని కోట తెలిపారు. ఆయన రాసిన మళ్లీ పాత పాటే నాటకంలో తాను కూడా నటించానని, ఆ నాటకంతో ఎంతో పేరొచ్చిందని గుర్తుచేసుకున్నారు.

తనతో పాటు ఇతరులు కూడా బాగా బతకాలి అనుకునే సహృదయుడు రాళ్లపల్లి అని, ఇద్దరు కుమార్తెల్లో ఒకమ్మాయి చనిపోయినప్పటినుంచి ఆయన ఎంతో కుంగిపోయారని వెల్లడించారు. ఒక మంచి మిత్రుడు మన మధ్య లేడంటే నమ్మలేకపోతున్నానని కోట విచారం వ్యక్తం చేశారు. కాగా, రాళ్లపల్లి కుమార్తె రష్యాలో వైద్య విద్య అభ్యసించడానికి వెళుతూ తీవ్ర జ్వరంతో విమానంలోనే మృతిచెందారు. ఏ విమానంలో అయితే రష్యా వెళ్లేందుకు ఎక్కారో అదే విమానంలో విగతజీవురాలై తిరిగొచ్చారు.
Rallapalli
Kota Srinivasa Rao

More Telugu News