Andhra Pradesh: గవర్నర్ నరసింహన్ తిరుమలలో డాలర్ శేషాద్రి పక్కన సరిగ్గా ఫిట్ అవుతారు!: వీహెచ్ ఎద్దేవా

  • ఈ విషయంలో చంద్రబాబుకు లేఖ రాస్తున్నా
  • గత పదేళ్లలో నరసింహన్ చేసిందేమీ లేదు
  • మళ్లీ గెలిచాక కేసీఆర్ కు గర్వం పెరిగిపోయింది
  • గాంధీభవన్ లో మీడియాతో కాంగ్రెస్ నేత

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రెండోసారి గెలవడంతో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు పూర్తిగా గర్వం పెరిగిపోయిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు విమర్శించారు. ఈ గర్వాన్ని పెద్దమ్మ తల్లి తప్పనిసరిగా అణచివేస్తోందని జోస్యం చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం రెండేళ్లలో పడిపోవాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ పై వీహెచ్ ఘాటు విమర్శలు చేశారు.

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు పదేళ్లు గవర్నర్ గా ఉన్నప్పటికీ నరసింహన్ చేసిందేమీ లేదనీ, ఆయన తిరుమలలో డాలర్ శేషాద్రి పక్కన నిలబడటానికి సరిగ్గా ఫిట్ అవుతారని ఎద్దేవా చేశారు. ఆయన గుళ్లు,గోపురాలకు తిరగడానికే పనికి వస్తారని దుయ్యబట్టారు. హైదరాబాద్ లోని గాంధీభవన్ లో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో వీహెచ్ మాట్లాడారు.

మర్రి చెన్నారెడ్డి రాజస్థాన్ గవర్నర్ గా ఎలా వ్యవహరించారో తాను చూశానని వీహెచ్ చెప్పారు. ఈఎస్ఎల్ నరసింహన్ కు తిరుమలలో డాలర్ శేషాద్రి పక్కన చోటు ఇవ్వాల్సిందిగా ఏపీ సీఎం చంద్రబాబుకు రేపు తాను లేఖ రాస్తానని తెలిపారు. నరసింహన్ ను తిరుమలకు పంపితే ఓవైపు శ్రీ వేంకటేశ్వరస్వామిని చూసుకుంటూ మరోవైపు తనను కలవడానికి వచ్చే వీఐపీలతో కూడా సమావేశమవుతారని ఎద్దేవా చేశారు.

More Telugu News