Sivaji: ట్విట్టర్ వేదికగా, టీవీల వేదికగా శునకానందం పొందుతున్న సోదరులందరికీ చెప్పేదొక్కటే...!: శివాజీ

  • నన్ను తొక్కేయాలనుకోవడం కుదరని పని
  • ఇక్కడ ఉన్నది ఓ కొండ
  • ప్రజలు అనుకోని ప్రభుత్వం వచ్చినా పోరాడతా

టీవీ9 చానల్ యాజమాన్యంతో వివాదాల నేపథ్యంలో హీరో శివాజీ ఓ వీడియో ద్వారా తెరపైకి వచ్చారు. తనపై పెట్టింది పెద్ద కేసేమీ కాదని, ఇంత చిన్న కేసుకు తాను విదేశాలకు పారిపోవాల్సిన అవసరం కూడా లేదని శివాజీ స్పష్టం చేశారు. పదేళ్లుగా రవిప్రకాశ్ తో ఉన్న స్నేహాన్ని దూరం చేసుకోవడం ఇష్టంలేక ఒప్పందాన్ని కోర్టులో పరిష్కరించుకుందామని ప్రయత్నిస్తుంటే ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. విజయవాడలో, మరెక్కడో రిసార్టుల్లో తలదాచుకున్నారని 10టీవీ, సాక్షి టీవీ, రామేశ్వర్ రావు గారి చానళ్లలో తోచిన విధంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

"మీ దగ్గర డబ్బులుంటే మీడియాతో మీరు ఏమైనా చేసుకోండి. అది మీ ఇష్టం. కానీ, ఓ వ్యక్తిని టార్గెట్ చేసి తొక్కేయాలని ప్రయత్నించడం కుదరనిపని. అయినా ఏంటి మీరు తొక్కేది? నెహ్రూ గారు తన జీవితంలో దాదాపు 9 ఏళ్లపాటు జైల్లోనే ఉన్నారు. నేనిప్పుడు జైలుకు వెళితే పోలీసులేమైనా మర్డర్ చేస్తారా? జై ఆంధ్రా ఉద్యమంలో ఎంతమంది జైలుకు వెళ్లలేదు? ఇప్పుడు మీరు విషయం అర్థం చేసుకోవాలి. ఇది నాకు, రవిప్రకాశ్ కు మధ్య ఉన్న వ్యవహారం. పైగా కోర్టులో ఉంది. ఇద్దరం స్నేహపూర్వక వాతావరణంలో చేసుకున్న ఒప్పందం అది. ఇదో సిల్లీ కేసు.

ఎలాంటి మ్యాటర్ లేని ఈ కేసులో ట్విట్టర్ వేదికగా, టీవీల వేదికగా శునకానందం పొందుతున్న సోదరులందరికీ చెప్పేదొక్కటే, ఇప్పుడు మీరు రాళ్లు వేస్తున్నారు. ఇక్కడ ఉన్నది ఓ కొండ. ఇలాంటి రాళ్లకు భయపడను. కానీ మీరు ఉన్న గాజు గదులు మీరు విసిరే రాయి దెబ్బకు పగిలిపోతాయి. ముందు ఆ విషయం చూసుకోండి. రాజ్యాంగం ఇచ్చిన హక్కులను అనుసరించి నేను ముందుకు వెళుతున్నాను. దేనికీ ఇబ్బంది పడను" అంటూ తనదైన శైలిలో శివాజీ వ్యాఖ్యానించారు. రేపు ఎన్నికల ఫలితాల తర్వాత ప్రజలు అనుకోని ప్రభుత్వం వచ్చినా పోరాడేందుకు తాను సిద్ధం అంటూ చెప్పుకొచ్చారు.

More Telugu News