Jammu And Kashmir: పుల్వామా ఉగ్రదాడి వెనక ‘ఆమె’.. వెలుగులోకి సంచలన విషయం

  • పాక్ యువతి హనీ ట్రాప్‌లో చిక్కుకున్న భారత జవాను
  • అతడి నుంచి సైనిక రహస్యాలను సేకరించిన యువతి
  • అతడిచ్చిన సమాచారంతోనే పుల్వామా ఆత్మాహుతి దాడి

పుల్వామా ఉగ్రదాడికి సంబంధించి మరో విస్తుపోయే విషయం వెలుగుచూసింది. పాకిస్థాన్ యువతి హనీ ట్రాప్‌లో చిక్కుకున్న భారత జవాను ఒకరు ఆమెకు సైనిక రహస్యాలను వెల్లడించిన విషయం తాజాగా బయటకు వచ్చింది. జవాను నుంచి సేకరించిన వివరాలను ఆమె ఉగ్రవాదులకు ఇవ్వడంతోనే పుల్వామా ఘటన జరిగినట్టు తెలుస్తోంది. మధ్యప్రదేశ్‌కు చెందిన యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్), కేంద్ర నిఘా సంస్థల దర్యాప్తులో ఈ సంచలన విషయం వెలుగు చూసింది.

మధ్యప్రదేశ్‌లోని మోహోలో ఉన్న బీహార్ రెజిమెంట్‌లో అవినాశ్ కుమార్ (25) నాయక్ క్లర్క్‌గా పనిచేసేవాడు. 2018లో అతడిని అసోంకు బదిలీ చేశారు. ఆ సమయంలో అతడికి ఓ పాకిస్థాన్ యువతితో వాట్సాప్ ద్వారా పరిచయం అయింది. ఆమె వలలో చిక్కుకున్న అవినాశ్ ఆమె అడిగిందే తడవుగా ముందు వెనక ఆలోచించకుండా సైనిక రహస్యాలను ఆమెకు చేరవేశాడు. వాటిని ఆమె ఉగ్రవాదులకు అందించేది.

అలా పక్కా సమాచారాన్ని సేకరించిన ఉగ్రవాదులు పుల్వామా దాడికి పక్కా పథక రచన చేసి అమలు చేశారు. అవినాశ్ బ్యాంకు ఖాతాకు పాకిస్థాన్ నుంచి రూ.50 వేలు జమ అయినట్టు దర్యాప్తు అధికారులు గుర్తించారు. అవినాశ్‌కు భోపాల్ ప్రత్యేక కోర్టు రిమాండ్ విధించింది.

More Telugu News