Tollywood: సీనియర్ సినీ నటుడు రాళ్లపల్లి కన్నుమూత

  • మ్యాక్స్ క్యూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
  • కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రాళ్లపల్లి
  • టాలీవుడ్ లో విషాదం

టాలీవుడ్ లో విషాదం నెలకొంది. సీనియర్ నటుడు రాళ్లపల్లి నరసింహారావు తీవ్ర అనారోగ్యంతో కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ మ్యాక్స్ క్యూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ సాయంత్రం తుదిశ్వాస విడిచారు. కుటుంబ సభ్యులు ఆయన భౌతిక కాయాన్ని మోతీనగర్ లోని నివాసానికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయన అంత్యక్రియలు రేపు జరిగే అవకాశం ఉంది.

 రాళ్లపల్లి తన కెరీర్ లో సుమారు 800కి పైగా చిత్రాల్లో నటించారు. ప్రతినాయకుడిగా, హాస్యనటుడిగా, క్యారక్టర్ ఆర్టిస్ట్ గా పాత్ర ఏదైనా ప్రాణప్రతిష్ట చేసిన ఘనత ఆయన సొంతం.

రాళ్లపల్లి 1945లో తూర్పుగోదావరి జిల్లా రాచపల్లిలో జన్మించారు. ఆయన పూర్తిపేరు రాళ్లపల్లి వెంకట నరసింహారావు. కుక్కకాటుకు చెప్పుదెబ్బ అనే చిత్రంతో సినీ రంగప్రవేశం చేశారు. ఊరుమ్మడి బతుకులు అనే చిత్రానికి ఆయన నంది అవార్డు అందుకున్నారు. నాటకరంగంలో విశేష అనుభవం ఉండడంతో ఆయనకు చిత్రసీమలో ఎదురులేకుండా పోయింది.

రాళ్లపల్లి ఓవైపు సినిమాల్లో నటిస్తూ కూడా నాటకాలు వేశారు. ఆ విధంగా తన వయసు సహకరించేవరకు దాదాపు 8000 నాటక ప్రదర్శనలు ఇవ్వడం విశేషం అని చెప్పాలి. ఆయన చివరగా నటించిన చిత్రం మారుతి దర్శకత్వంలో నాని హీరోగా వచ్చిన భలేభలే మగాడివోయ్ చిత్రం. ఆపై వృద్ధాప్య సంబంధ సమస్యలతో ఇంటికే పరిమితం అయ్యారు.

More Telugu News