Andhra Pradesh: ఎన్ఆర్ కమ్మపల్లెలో ఉద్రిక్తత.. వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డిని మళ్లీ అడ్డుకున్న గ్రామస్థులు!

  • అనుచరులతో కలిసి వచ్చిన చెవిరెడ్డి
  • బయటివారిని తీసుకొస్తున్నారని గ్రామస్థుల గుస్సా
  • ఇరువర్గాల మధ్య వాగ్వాదం.. పోలీసుల జోక్యం

చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో నిన్న చెలరేగిన ఉద్రిక్తత ఇంకా చల్లారలేదు. నియోజకవర్గంలోని ఎన్ఆర్ కమ్మపల్లెలో ఈరోజు మరోసారి వాతావరణం హాట్ హాట్ గా మారింది. ఈరోజు ఉదయం అనుచరులతో కలిసి వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మరోసారి ఎన్ఆర్ కమ్మపల్లె గ్రామంలోకి వచ్చేందుకు ప్రయత్నించగా, స్థానికులు అడ్డుకున్నారు. బయటవారిని ఊరిలోకి తీసుకొచ్చి ఉద్రిక్త పరిస్థితులు సృష్టిస్తున్నారని చెవిరెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘మా ఊరిలోకి వచ్చి మీరు ప్రచారం నిర్వహించాల్సిన అవసరం లేదు.  మీకు ఓట్లు పడలేదన్న కారణంతో మళ్లీ మా ఊరిలో రీపోలింగ్ నిర్వహించాలని మీరు ఫిర్యాదు చేశారు. ఇక్కడ పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదు’ అని గ్రామస్థులు స్పష్టం చేశారు. దీంతో ఎన్ఆర్ కమ్మపల్లెకు చెందిన కొందరు వ్యక్తులు, చెవిరెడ్డి వర్గీయులు వాగ్వాదానికి దిగగా, ఇరువర్గాలను పోలీసులు సముదాయించారు. నిన్న రాత్రి కూడా ఇదే తరహాలో చెవిరెడ్డిని ఎన్ఆర్ కమ్మపల్లె వాసులు అడ్డుకున్నారు.

ఈ క్రమంలో టీడీపీ నేత పులివర్తి నాని అక్కడకు చేరుకోవడంతో పరిస్థితి ఒక్కసారిగా అదుపుతప్పింది. దీంతో చెవిరెడ్డి, పులివర్తి నానిలను అరెస్ట్ చేసిన పోలీసులు పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఎన్ఆర్ క‌మ్మ‌ప‌ల్లె, క‌మ్మ‌ప‌ల్లె, పులివ‌ర్తి ప‌ల్లె, కొత్త కండ్రిగ‌, వెంక‌ట్రామాపురం గ్రామాల్లో ఎస్సీలను ఓటేయనివ్వలేదనీ, కాబట్టి రీపోలింగ్ నిర్వహించాలని వైసీపీ నేత చెవిరెడ్డి ఇటీవల ఈసీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ఐదు పోలింగ్ కేంద్రాల్లో ఈ నెల 19న ఎన్నికలు నిర్వహించాలని ఈసీ నిర్ణయించింది.

More Telugu News