Abhishek Singhvi: ఏపీలో రీపోలింగ్‌పై ఈసీని కలిసిన కాంగ్రెస్, టీడీపీ, ఆప్ ప్రతినిధులు

  • 34 రోజుల తర్వాత రీపోలింగ్ ఏంటో అర్థం కావట్లేదు
  • ఈసీ నిర్ణయం సరైంది కాదు
  • ఏకపక్ష నిర్ణయాలేంటి?
  • బీజేపీకి, వైసీపీకి మాత్రమే అనుకూలం
  • సీఎస్‌కు చెప్పినదాన్నే ఫిర్యాదుగా తీసుకున్నారు

ఏపీలో రీపోలింగ్, పశ్చిమ బెంగాల్‌లో హింసాత్మక ఘటనలపై కాంగ్రెస్, టీడీపీ, ఆప్ తదితర పార్టీలన్నీ నేడు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశాయి. ఈ విషయమై కాంగ్రెస్ నేత అభిషేక్ సింఘ్వి మీడియాతో మాట్లాడుతూ, కేంద్ర ఎన్నికల సంఘం తీరుపై మండిపడ్డారు. ఎన్నికలు జరిగిన 34 రోజుల తరువాత రీపోలింగ్ ఏంటో తమకు అర్థం కావట్లేదన్నారు. రీపోలింగ్ నిర్వహించాలన్న ఈసీ నిర్ణయం సరైంది కాదన్నారు. ఫిర్యాదు వస్తే విచారణ నిర్వహించి నిజానిజాలు తెలిశాక చర్య తీసుకోవాలి గానీ ఏకపక్ష నిర్ణయాలేంటని అభిషేక్ సింఘ్వి ప్రశ్నించారు.

ఈసీ నిర్ణయాలన్నీ బీజేపీ, వైసీపీకి అనుకూలంగా ఉన్నాయని, ఆ రెండు పార్టీలు ఏం చెబితే అదే చేస్తోందని ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధి కంభంపాటి రామ్మోహనరావు మండిపడ్డారు.  అనంతరం సీఎం రమేశ్ మాట్లాడుతూ, చంద్రగిరి వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సీఎస్‌కు చెప్పినదాన్ని ఫిర్యాదుగా తీసుకున్నారని విమర్శించారు. రీపోలింగ్ నిర్వహిస్తున్న ఐదు పోలింగ్ బూత్‌లు టీడీపీకి అనుకూలమైనవన్నారు. ప్రజలు టీడీపీకి ఏకపక్షంగా ఓటేయడం కారణంగానే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

More Telugu News