Telugudesam: నీకేమైనా బుద్ధి ఉందా? తెలిసే మాట్లాడుతున్నావా?: మీడియా ప్రతినిధిపై సీఎం రమేశ్ ఆగ్రహం

  • ఇలా రీపోలింగ్ లు పెట్టుకుంటూ పోవడమేనా ఈసీ పని?
  • ఈసీ తీరుపై మండిపడిన సీఎం రమేశ్
  • విచారణ లేకుండానే రీపోలింగ్ పెడుతున్నారు

అఖిలపక్షం నేతలు ఇవాళ ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి వినతిపత్రం అందించారు. అనంతరం టీడీపీనేత సీఎం రమేశ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రమేశ్ ఈసీ తీరుపై ఆగ్రహంతో రగిలిపోతూ మాట్లాడుతుండగా, ఓ విలేకరి అడిగిన ప్రశ్నతో ఆయనలో కోపం కట్టలు తెంచుకుంది. నీకేమైనా బుద్ధి ఉందా? తెలిసే మాట్లాడుతున్నావా? అంటూ మండిపడ్డారు. ఏదైనా ప్రశ్న అడిగే ముందు అన్ని విషయాలు సరిచూసుకుని మాట్లాడాలని హితవు పలికారు.

చంద్రగిరి నియోజకవర్గంలో ప్రజలు ఎన్ని సార్లు పోలింగ్ పెట్టినా ఓట్లేస్తారని, కానీ ఎన్నికల సంఘానికి ఇలా రీపోలింగ్ లు పెట్టుకుంటూ పోవడమేనా పని? అంటూ అసహనం వ్యక్తం చేశారు. తాము పోలింగ్ జరిగిన 11వ తేదీనే కొన్నిచోట్ల రీపోలింగ్ కోరామని, అయితే ఈసీ పట్టించుకోలేదని అన్నారు.  ఏపీలో చంద్రగిరి అంశంలో వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఫిర్యాదు చేయగా, ఆ ఫిర్యాదు చీఫ్ సెక్రటరీకి వెళ్లిందని తెలిపారు. వాస్తవానికి సీఎస్ కు ఈ వ్యవహారంలో సంబంధం లేదని అన్నారు. కానీ  చెవిరెడ్డి నేరుగా ఈసీకి ఫిర్యాదు చేయకపోయినా, ఆయన  సీఎస్ కు చెప్పినదాన్ని ఫిర్యాదుగా తీసుకున్నారని మండిపడ్డారు.

అయితే ఈసీ దీనిపై ఎలాంటి విచారణ లేకుండానే రీపోలింగ్ జరపాలని ఎలా నిర్ణయిస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఐదు పోలింగ్ కేంద్రాలు ఎప్పట్నించో టీడీపీకి అనుకూలంగా ఉన్న బూత్ లని, ఇక్కడ టీడీపీకి ఏకపక్షంగా ఓట్లు పడే అవకాశాలున్నాయని అన్నారు. ఈసీ తమకందిన ఫిర్యాదుపై ఎలాంటి విచారణ జరపకుండా రీపోలింగ్ కు ప్రకటన చేయడం దారుణమని అభిప్రాయపడ్డారు. కేంద్ర ఎన్నికల సంఘం పూర్తిగా బీజేపీ అదుపాజ్ఞల్లోనే నడుస్తుందని సీఎం రమేశ్ ఈ సందర్భంగా ఆరోపించారు. ఈ విషయంలో ఈసీఐ అడ్డంగా దొరికిపోయిందని, ఫలితాల అనంతరం ఈసీఐ పనిబడతామని స్పష్టం చేశారు.

More Telugu News