Telugudesam: ఎన్నికల సంఘం జగన్ కే అనుకూలం: టీడీపీ అధికార ప్రతినిధి యామిని

  • ఈ విషయాన్ని ప్రజలే అంటున్నారు
  • టీడీపీ 150కి పైగా ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదు
  • ఈసీ ఏకపక్షంగా వ్యవహరిస్తోంది

టీడీపీ అధికార ప్రతినిధి యామిని సాధినేని రాష్ట్రంలో రాజకీయ స్థితిగతులపై తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. ఎంతో పారదర్శకంగా వ్యవహరించాల్సిన ఎన్నికల సంఘం రాష్ట్రంలో ఏకపక్షంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. టీడీపీ 150కి పైగా ఫిర్యాదులు చేసినా లెక్కలోకి తీసుకోకపోవడాన్ని ఏమనాలి? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఈసీ జగన్ కే అనుకూలంగా ఉందని చెప్పడానికి తాము చింతిస్తున్నామని, ఈ మాట తాము అంటున్నది కాదని, ప్రజలే అంటున్నారని యామిని స్పష్టం చేశారు.

ఎన్నికల కమిషన్ పేరును వైసీపీ కమిషన్ అనో, బీజేపీ కమిషన్ అనో పెడితే బాగుంటుందని ఆమె ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా ఆమె ప్రతిపక్ష నేత జగన్ వ్యవహారశైలిపైనా విమర్శలు గుప్పించారు. గత ఎన్నికల్లో ఓటమిపాలైన తర్వాత సామాన్లు సర్దుకుని రాష్ట్రానికి వచ్చి ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉంటూ వాళ్ల సమస్యలు తీర్చాల్సిన వ్యక్తి ఐదేళ్లపాటు హైదరాబాద్ లోటస్ పాండ్ లోనే ఉండిపోయాడని, ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా రాదని తెలిసీ లోటస్ పాండ్ నుంచి సామాన్లతో సహా అమరావతి వచ్చేస్తున్నారని, జగన్ కు ఎప్పుడు ఏంచేయాలో ఏమాత్రం తెలియదనడానికి ఇదే నిదర్శనం అని విమర్శించారు. జగన్ కు, చంద్రబాబునాయుడిగారికి ఇదే తేడా అని యామిని పేర్కొన్నారు.

అభివృద్ధి అనే శిల్పాన్ని నిరంతరం చెక్కుతూ సంక్షేమ ఫలాలను ప్రజలకు పంచాలనుకునే వ్యక్తి చంద్రబాబు అని, కనీసం ప్రజలకు ఏ విధంగా అందుబాటులో ఉండాలి, ఎలా ఉపయోగపడాలి అని కూడా తెలియని వ్యక్తి జగన్ అని విశ్లేషించారు. ఇక, ఢిల్లీ అధినాయకత్వం రాష్ట్రంపై కక్ష కడితే ఇంటి దొంగలు శత్రువులకు ద్వారాలు తెరిచి కూర్చున్నారని, చివరికి ఇంట్లో ప్రవేశించే శత్రువుల కింద ఇంటి దొంగలు కూడా నలిగిపోతారన్న విషయం తెలుసుకోవాలి అంటూ రాజకీయ ప్రత్యర్థులకు చురకలంటించారు.

ఒకప్పుడు రాజ్యకాంక్షతో రాజులు అడ్డొచ్చినవారందరినీ నరుక్కుంటూ వెళ్లేవారని పుస్తకాల్లో రాసేవారని, అయితే ఇప్పుడు మోదీ..  'నన్ను చూసి ఆ పుస్తకాల్లో రాసిన విషయాలకు అన్వయించుకోండంటూ' నిరంకుశ రాజులు చేసినట్టే చేస్తున్నారని వ్యాఖ్యానించారు. అడ్డొచ్చిన ప్రతిపక్షాలను, మీడియాను, ఆఖరికి ప్రజలను కూడా ఇబ్బందుల పాల్జేస్తున్నారని మండిపడ్డారు. కనీసం తమ ప్రాబల్యం ఏమాత్రం లేని రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని తపించిపోతున్నారని విమర్శించారు.

More Telugu News