America: జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌

  • కంప్యూటర్‌ నెట్‌వర్క్‌కు ముప్పు ఉండడంతో నిర్ణయం
  • అమెరికా కంపెనీలు విదేశీ సేవలు పొందకుండా ఆంక్షలు
  • చైనాకు చెందిన హువావేని దృష్టిలో పెట్టుకునే నిర్ణయమని ప్రచారం

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. దేశంలోని కంప్యూటర్‌ నెట్‌వర్క్‌కు విదేశీ శత్రువుల నుంచి ముప్పు పొంచి ఉందన్న నిఘావర్గాల హెచ్చరికల నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏ కంపెనీ పేరును ప్రత్యేకంగా ప్రస్తావించకున్నా ఎమర్జెన్సీ కారణంగా అమెరికా కంపెనీలు విదేశీ టెలికాం సేవలను వినియోగించడానికి బ్రేక్‌ పడింది.

 చైనాకు చెందిన హువావే కంపెనీ ఆ దేశం కోసం అమెరికా, దాని మిత్రపక్ష దేశాల్లో గూఢచర్యంకు పాల్పడుతోందన్న ఆరోపణల నేపథ్యంలో హువావేని దృష్టిలో పెట్టుకునే అమెరికా అధ్యక్షుడు ఈ నిర్ణయం తీసుకుని ఉంటారని భావిస్తున్నారు. హువావే నెట్‌వర్క్‌ను వాడ వద్దంటూ అమెరికా తన మిత్రపక్షాలపై ఒత్తిడి తెస్తుండడం కూడా ఇందులో భాగమేనని చెబుతున్నారు. అత్యవసర పరిస్థితిని ప్రకటించడంతోపాటు హువావేపై అమెరికా ఆంక్షలు కూడా విధించింది. ప్రభుత్వ అనుమతి లేకుండా  హువావే అమెరికా సంస్థల నుంచి ఎటువంటి పరికరాలు కొనుగోలు చేయకూడదని స్పష్టం చేసింది.

దీనిపై  హువావే స్పందిస్తూ తాము వ్యాపారం చేయకుండా అడ్డుకుంటే అమెరికా వినియోగదారులు, కంపెనీలే ఇబ్బంది పడతాయని స్పష్టంచేసింది. అమెరికా ఆంక్షలు అర్థంలేనివని, తాము ఏ దేశం కోసం పనిచేయడం లేదని స్పష్టం చేసింది. తమతో వ్యాపారాన్ని వదులుకుని ఖరీదైన ప్రత్యామ్నాయం వైపు ఆ దేశం అడుగు వేస్తోందని ఆరోపించారు.

ఈ నిర్ణయాలతో అమెరికా, చైనా మధ్య సంబంధాలు ఘోరంగా  దెబ్బతినే ప్రమాదం ఉంది. కాగా, అమెరికా నెట్‌వర్క్‌ను కాపాడుకునేందుకు ట్రంప్‌ సరైన చర్య తీసుకున్నారని ఫెడరల్‌ కమ్యూనికేషన్స్‌ చైర్మన్‌ అజిత్‌ స్వాగతించారు.

More Telugu News