తన కుమార్తెపై వేధింపులకు కారణమైందన్న ఆగ్రహంతో.. నడిరోడ్డుపై మహిళ గొంతుకోసిన తండ్రి!

15-05-2019 Wed 12:05
  • ఫోన్ నంబర్ తీసుకుని వేధిస్తున్న అపరిచితుడు
  • నంబర్ ఎవరిచ్చారో తెలుసుకుని గొడవకు దిగిన బాధితురాలి తండ్రి
  • కడప జిల్లా బద్వేలులో ఘటన

తన కుమార్తె ఫోన్‌ నంబర్‌ ను వేరే వ్యక్తికి ఇచ్చిందన్న ఆగ్రహంతో, నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఓ మహిళ గొంతు కోసిన ఘటన కడప జిల్లా బద్వేలులో కలకలం రేపింది. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, సిద్ధవటం రోడ్డులోని నూర్‌ బాషాకాలనీలో టైలర్ గా పని చేసుకునే రాయపాటి బాషాకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. చిన్న కుమార్తె భర్త బెంగళూరులో పని చేసుకుంటుండగా, ఆమె తండ్రి వద్దే ఉంటోంది.

ఈ క్రమంలో ఆమెకు ఓ ఫోన్ నంబర్ నుంచి తరచూ రాంగ్ కాల్స్ వస్తుండటం, వేధిస్తుండటంతో బాషా మరో నంబర్ నుంచి అదే ఫోన్ కు కాల్ చేసి నిలదీశాడు. తనకు అదే కాలనీలో ఉండే వెంకట సుబ్బారెడ్డి భార్య సుబ్బలక్ష్మమ్మ ఫోన్ నంబర్ ఇచ్చిందని చెప్పడంతో ఆమెపై కక్ష పెంచుకున్నాడు. తన కుమార్తె ఫోన్ నంబర్ ను అపరిచితుడికి ఇచ్చావంటూ ఇటీవలి కాలంలో పలుమార్లు ఆమెతో గొడవకు దిగాడు.

అయినా వేధింపుల కాల్స్ ఆగక పోవడంతో, పాల కోసం బయటకు వచ్చిన సుబ్బలక్ష్మమ్మపై కత్తితో దాడి చేసి గొంతు కోశాడు. ఈ ఘటనలో ఆమెకు తీవ్రగాయాలు కాగా, స్థానికులు ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఆమెను కడప రిమ్స్ కు తరలించిన పోలీసులు, కేసు నమోదు చేసుకుని బాషాను అరెస్ట్ చేశారు.