UPA: ఢిల్లీలో మే 23న బీజేపీయేతర పక్షాల భేటీ.. కేసీఆర్‌, జగన్‌లకు సోనియా ఆహ్వానం?

  • సోనియాగాంధీ లేఖలు రాసినట్లు ప్రచారం
  • ఎన్నికల ముందే ఒక్కతాటిపైకి తెచ్చే ప్రయత్నం
  • భవిష్యత్తు కార్యాచరణకు సమావేశంలో దిశానిర్దేశం

అటు చంద్రబాబు...ఇటు జగన్‌, కేసీఆర్‌...ఒకే సమావేశంలో ఆసీనులు కావడం సాధ్యమా? అంటే,  రాజకీయాల్లో ఏదీ అసాధ్యం కాదు అనేలా తాజాగా రాజకీయ వర్గాల్లో జరుగుతున్న ఓ ప్రచారం ఆసక్తిని రేకెత్తిస్తోంది. మే 23వ తేదీన ఢిల్లీలో యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ నేతృత్వంలో నిర్వహించ తలపెట్టిన బీజేపీయేతర పక్షాల భేటీకి తెలుగు రాష్ట్రాల నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఏపీ విపక్ష నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డికి ఆహ్వానాలు అందాయట.

ఈ సమావేశాలకు వీరిని ఆహ్వానిస్తూ సోనియా గాంధీ స్వయంగా లేఖలు రాశారని సమాచారం. మే 23వ తేదీనే సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నందున అధికార బీజేపీకి ఫలితాలు అనుకూలంగా లేకపోతే భవిష్యత్తు కార్యాచరణకు ఈ సమావేశం దిశానిర్దేశం చేసేలా ఉండాలనేది సోనియా ఆలోచనగా తెలుస్తోంది. అందుకే ఇటు యూపీయే, అటు ఎన్టీయేలో భాగస్వాములుకాకుండా తటస్థంగా ఉన్న పార్టీలు సమావేశానికి హాజరు కావాలని సోనియా ఆహ్వానం పంపినట్లు తెలుస్తోంది.

ఇందులో భాగంగా టీడీపీతోపాటు టీఆర్‌ఎస్‌, వైసీపీలకు కూడా ఆహ్వానాలు అందినట్లు సమాచారం. అయితే బీజేపీయేతర పక్షాలను ఏకం చేసేందుకు కాంగ్రెస్‌తో కలిసి కీలకంగా వ్యవహరిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుతో కలిసి ఒకే సమావేశంలో కూర్చునేందుకు కేసీఆర్‌, జగన్‌లు అంగీకరిస్తారా? అన్నదే ఇప్పుడు ప్రశ్న.

ఫెడరల్ ఫ్రంట్ పేరుతో మూడో కూటమి ఏర్పాటు ప్రయత్నంలో కేసీఆర్ ఉన్నారు. ఇందుకోసం ఇప్పటికే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. సార్వత్రిక ఎన్నికల ముందే కేటీఆర్, జగన్ తో లోటస్ పాండ్ లో భేటీ అయ్యారు. ఈ నేపధ్యంలో వీరు ఎలా వ్యవహరిస్తారో చూడాలి.

More Telugu News