పపువా న్యూగినియాను కుదిపేసిన భారీ భూకంపం

15-05-2019 Wed 09:14
  • భూమి లోపల పది కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం
  • భూకంప కేంద్రానికి వెయ్యి కిలోమీటర్ల పరిధిలో సునామీ వచ్చే అవకాశం ఉందని హెచ్చరిక
  • సముద్రం నుంచి ప్రమాదకరమైన సంకేతాలు లేవన్న పపువా న్యూగినియా
పపువా న్యూ గినియాను భారీ భూకంపం కుదిపేసింది. రాబౌల్‌లో 7.5 తీవ్రతతో సంభవించిన ఈ భూకంపంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. సునామీ భయంతో వణికిపోయారు. అయితే, సునామీకి సంబంధించి ఎటువంటి సూచనలు లేవని అధికారులు తెలిపారు. భూకంపం కారణంగా సంభవించిన ప్రాణ, ఆస్తినష్టం గురించి సమాచారం అందాల్సి ఉంది.

భూకంపం చాలా బలంగా సంభవించిందని, ప్రకంపనలతో రాబౌల్ నగరం ఊగిపోయిందని పోలీసులు తెలిపారు. రాబౌల్‌కు తూర్పున 50 కిలోమీటర్ల దూరంలో పది కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్టు  అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. భూకంప కేంద్రం నుంచి వెయ్యి కిలోమీటర్ల పరిధిలో సునామీ వచ్చే అవకాశం ఉందని పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం తెలిపింది. అయితే, పపువా న్యూగినియా విపత్తు నిర్వహణ సంస్థ మాత్రం సముద్రం నుంచి ప్రమాదకరమైన సంకేతాలను గుర్తించలేదని తెలిపింది. ప్రస్తుతం అంతా బాగానే ఉందని పేర్కొంది.