ys rajashekar reddy: వైఎస్ రాజశేఖర్ రెడ్డిని మేము తలచుకోని రోజు అంటూ ఉండదు: ఉండవల్లి అరుణ్ కుమార్ భార్య జ్యోతి

  • నా భర్తలో ‘వర్త్’ ను వెలికితీసింది వైఎస్పార్
  • ఓ కార్యకర్తను ఎంపీ స్థాయికి ఎదిగేలా చేశారు
  • ఈరోజున ఆయన పెన్షనర్.
  • మా అమ్మ ఆకాంక్షను నెరవేర్చిన ఘనత వైఎస్ ది

వైఎస్ రాజశేఖర్ రెడ్డిని తాము తలచుకోని రోజు అంటూ ఉండదని ప్రముఖ రాజకీయవేత్త ఉండవల్లి అరుణ్ కుమార్ భార్య జ్యోతి అన్నారు. ఉండవల్లి రచించిన ‘వైఎస్ఆర్ తో.. ఉండవల్లి’ పుస్తకావిష్కరణ కార్యక్రమం హైదరాబాద్ లోని దస్ పల్లా హోటల్ లో జరిగింది. వైఎస్ రాజశేఖరరెడ్డిని తాము తలచుకోని రోజు ఎందుకు ఉండదో ఈ కార్యక్రమానికి హాజరైన జ్యోతి వివరించి చెప్పారు.

నాడు ఉండవల్లితో తన వివాహం గురించిన విషయాలను ఆమె ఈ సందర్భంగా ప్రస్తావించారు. తాడూబొంగరం లేని ఉండవల్లిని ఎలా పెళ్లి చేసుకుంటావని తమ ఇంట్లో వాళ్లు అనేవారని అన్నారు. పెన్షన్ వచ్చే ఉద్యోగం ఉంటే బాగుంటుందని, అలాంటి జాబ్ తన భర్త చేస్తే బాగుంటుందని తన తల్లి ఎప్పుడూ తనతో చెప్పేవారని జ్యోతి గుర్తుచేసుకున్నారు. ఈ క్రమంలో తన భర్త బ్యాంకు ఉద్యోగాలకు ప్రవేశ పరీక్షలు రాశారని, అయినా ఉపయోగం లేకుండా పోయిందని అన్నారు.

ఓ రోజు ‘రాజకీయం తప్ప నాకు ఏం తెలియదని' మా అమ్మతో తన భర్త చెప్పారని, దీంతో, ఆమె కూడా ఇక వదిలేశారని చెప్పుకొచ్చారు. రాజకీయాల్లోనే తన భర్త కొనసాగుతున్న సమయంలో ఆయనలో ఉన్న‘వర్త్’ ను వైఎస్ రాజశేఖర్ రెడ్డి గుర్తించి ప్రోత్సహించారని, ఈ రోజున ఈ స్టేజ్ పై తన భర్త ఉండటానికి వైఎస్సే కారణమని కొనియాడారు. నాడు కార్యకర్తగా ఉన్న తన భర్తను ఎంపీగా చేశారని, ఈరోజున ఆయన ‘పెన్షనర్’ కూడా అని చమత్కరించారు. ఆ రోజున తన తల్లి తమ కోసం ఏదైతే ఆకాంక్షించిందో, దాన్ని నెరవేర్చిన ఘనత వైఎస్ రాజశేఖర్ రెడ్డిదని జ్యోతి వ్యాఖ్యానించడంతో చప్పట్లు మార్మోగిపోయాయి.

More Telugu News