stalin: కేసీఆర్ ఆశలపై నీళ్లు చల్లిన స్టాలిన్... ఫెడరల్ ఫ్రంట్ అసాధ్యమంటూ స్పష్టీకరణ

  • బీజేపీ, కాంగ్రెస్ లేని ఫ్రంట్ అసాధ్యం
  • ఎన్నికల తర్వాతే ఫ్రంట్ పై నిర్ణయం
  • మర్యాదపూర్వకంగానే కేసీఆర్ నన్ను కలిశారు
కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్ లు లేని ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ యత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన ఇప్పటికే మమతా బెనర్జీ, అఖిలేశ్ యాదవ్, కుమారస్వామి, పినరయి విజయన్, నవీన్ పట్నాయక్ తదితర నేతలను కలిశారు. నిన్న డీఎంకే అధినేత స్టాలిన్ తో మరోసారి భేటీ అయ్యారు.

ఈ నేపథ్యంలో ఈరోజు మీడియాతో స్టాలిన్ మాట్లాడుతూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు లేకుండా మూడో ఫ్రంట్ ఏర్పడుతుందని తాను భావించడం లేదని స్పష్టం చేశారు. మే 23న ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాతే ఫ్రంట్ పై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

కూటమిని ఏర్పాటు చేసే ప్రయత్నంలో భాగంగా కేసీఆర్ చెన్నైకి రాలేదని స్టాలిన్ తెలిపారు. తమిళనాడులోని పలు ఆలయాల సందర్శనకు ఆయన వచ్చారని చెప్పారు. ఈ నేపథ్యంలో, మర్యాదపూర్వకంగా కలుద్దామని తన అపాయింట్ మెంట్ కోరారని తెలిపారు.

మరోవైపు డీఎంకే అధికార ప్రతినిధి శరవణన్ నిన్న మీడియాతో మాట్లాడుతూ, రాహుల్ గాంధీనే తమ ప్రధాని అభ్యర్థి అని స్టాలిన్ ఇప్పటికే స్పష్టం చేశారని తెలిపారు. యూపీఏని బలోపేతం చేసేందుకు సహకరించాలని కేసీఆర్ ను కోరారని చెప్పారు.
stalin
kcr
federal front
TRS
cmk

More Telugu News