Tamota: భారీగా తగ్గిన టమోటా దిగుబడి... కిలో రూ. 50 పైనే!

  • ఎండలు పెరగక ముందు కిలో రూ. 20
  • పంటలకు నీరు లేక పడిపోయిన దిగుబడి
  • సాగు ఆశాజనకంగా లేదంటున్న రైతులు
  • ధర ఉన్నా దిగుబడి లేదని వాపోతున్న రైతన్న

ఎండలు పెరగక ముందు వరకూ కిలో 20 రూపాయల వరకూ ఉన్న టమోటా ధర, ఇప్పుడు కొండెక్కి కూర్చుంది. బహిరంగ మార్కెట్లో కిలో టమోటా రూ. 50 వరకూ పలుకుతోంది. ఎండలు పెరగడంతో దిగుబడి తగ్గిపోయిందని, ధరలు బాగున్నా, పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేదని, రాష్ట్రావసరాలకు మినహా, ఎగుమతి చేసే అవకాశాలు లేవని రైతులు వాపోతున్న పరిస్థితి. తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్దదైన మదనపల్లె మార్కెట్ కు గడచిన పది రోజులుగా వస్తున్న టమోటా పంట భారీగా పడిపోయింది. ఈ సంవత్సరంలో 17 వేల హెక్టార్లలో పంటను సాగు చేయగా, జనవరి, ఫిబ్రవరి నెలలు ఫర్వాలేదనిపించాయి. ఆపై మార్చి నుంచి నీరు లేక దిగుబడి తగ్గిపోయింది.

ఈ సంవత్సరం ఆరంభంలో ఎకరం పొలంలో 120 ట్రేల దిగుబడి రాగా, ఇప్పుడది 40 ట్రేలకు పడిపోయిందని రైతులు అంటున్నారు. ఎండల వల్ల పూత రావడంలేదని, దీంతో మార్కెట్లో ధర ఉన్నా, తమకు ప్రయోజనం దక్కడం లేదని వాపోతున్నారు. సమీప భవిష్యత్తులో టమోటా ధర మరింతగా పెరుగుతుందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గత సంవత్సరం మేతో పోలిస్తే, ఈ సంవత్సరం మార్కెట్ కు వస్తున్న దిగుబడి సగానికి పైగా పడిపోవడమే ఇందుకు కారణమని అంచనా వేస్తున్నారు. 'ఫణి' తుపాను ముఖం చాటేయడంతో వర్షాలు కురుస్తాయని రైతులు పెట్టుకున్న ఆశలు అడియాశలు కావడం, ఆపై వరుణుడి కరుణ లేక సాగు ఆశాజనకంగా కనిపించడం లేదని రైతులు అంటున్నారు.

More Telugu News