Andhra Pradesh: పెళ్లి కొచ్చి వధూవరులను ఆశీర్వదించండి.. ఎన్నికల ఫలితాల లైవ్ చూడండి: ఆకట్టుకుంటున్న శుభలేఖ

  • నెల్లూరు దుస్తుల షాపు యజమాని వినూత్న ఆలోచన
  • కుమార్తె పెళ్లికి అతిథులను రప్పించే ప్రయత్నం
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న శుభలేఖ
ఈ నెల 23న బోల్డన్ని పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి. అదే రోజున సార్వత్రిక ఎన్నికల ఫలితాలు కూడా విడుదల కానున్నాయి. ఇప్పటికే 40 రోజులుగా ఫలితాల కోసం ఎదురుచూస్తున్నవారు ఆ రోజున టీవీలకు అతుక్కుపోవడం ఖాయం. మరి వారిని పెళ్లి మండపానికి ఎలా రప్పించాలి? అద్భుతమైన ప్లాన్ వేశాడు నెల్లూరుకు చెందిన ఓ వస్త్ర దుకాణ యజమాని.

పట్టణానికి చెందిన బయ్యా వాసు కుమార్తె వివాహం ఈ నెల 23న ఉదయం 11:51 గంటలకు జరగనుంది. అదే రోజున మరిన్ని పెళ్లిళ్లు ఉండడంతో పాటు ఎన్నికల ఫలితాలు కూడా విడుదల కానున్నాయి. దీంతో తన కుమార్తె పెళ్లికి అతిథులు రావడం కష్టమేనని భావించిన వాసు.. శుభలేఖను వెరైటీగా ముద్రించారు. కల్యాణ మండపంలోనే ఎన్నికల ఫలితాలను ప్రత్యక్షంగా వీక్షించే ఏర్పాట్లు చేసినట్టు శుభలేఖపై రాసుకొచ్చారు. ఆకట్టుకునేలా ఉన్న ఈ శుభలేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Andhra Pradesh
Nellore District
Wedding card
Social Media

More Telugu News