BJP: పాక్ జాతిపిత జిన్నాను భారత ప్రధానిని చేసి ఉండాల్సింది: బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు

  • అప్పట్లో జిన్నాను ప్రధానిని చేసి ఉంటే దేశం రెండు ముక్కలయ్యేదే కాదు
  • జిన్నా తెలివైనవాడు, విద్యావంతుడు
  • దేశ విభజనకు నెహ్రూనే కారణం
పాకిస్థాన్ జాతిపిత మహ్మద్ అలీ జిన్నాపై కాంగ్రెస్ నేత శతృఘ్న సిన్హా ప్రశంసలు కురిపించి విమర్శలు మూటగట్టుకుని మూడు రోజులు కూడా గడవకముందే బీజేపీ నేత ఒకరు జిన్నాను కీర్తించారు. జిన్నా చాలా తెలివైన వాడని, విజ్ఞుడని పేర్కొన్న మధ్యప్రదేశ్ బీజేపీ నేత, రాట్లం-ఝుబువా అభ్యర్థి గుమన్ సింగ్ దామర్ ప్రశంసించారు. ఆయనను కనుక భారత ప్రధానిని చేసి ఉంటే భారత్ రెండు ముక్కలు అయ్యేదే కాదని అన్నారు.  ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన ర్యాలీలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. పనిలో పనిగా భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూపైనా తీవ్ర ఆరోపణలు చేశారు. దేశ విభజనకు ఆయనే కారణమని దుమ్మెత్తి పోశారు.  

దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన సమయంలో నెహ్రూ కనుక పట్టుబట్టకపోయి ఉంటే దేశ విభజన జరిగి ఉండేదే కాదన్నారు. జిన్నా చాలా తెలివైన వాడని, విద్యావంతుడు, న్యాయవాది కూడా అని గుమన్ పేర్కొన్నారు. స్వాతంత్ర్యం సిద్ధించిన సమయంలో అందరూ కలిసి ఓ నిర్ణయం తీసుకుని జిన్నాను ప్రధాని చేసి ఉంటే దేశం రెండు ముక్కలయ్యేదే కాదని, ఇప్పుడీ పరిస్థితి ఉండేదే కాదని పేర్కొన్నారు.

జిన్నాను ప్రశంసించిన శతృఘ్న సిన్హా వ్యాఖ్యలపై విరుచుకుపడిన బీజేపీ తీవ్ర విమర్శలు చేసింది. కాంగ్రెస్, పాకిస్థాన్ ఒకటేనని ధ్వజమెత్తింది. ఇప్పుడు ఏకంగా బీజేపీ నేతే జిన్నాను పొగడడంతో కాంగ్రెస్ నేతలకు మంచి ఆయుధం దొరికినట్టు అయింది.
BJP
Gumansingh Damor
Muhammad Ali Jinnah
Madhya Pradesh
Nehru

More Telugu News