TV9: అజ్ఞాతంలోకి టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్.. సెల్‌ఫోన్లు స్విచ్చాఫ్.. నటుడు శివాజీకి పోలీసుల హెచ్చరిక

  • బంజారాహిల్స్‌లోని రవిప్రకాశ్ ఇంటికి వెళ్లిన పోలీసులు
  • ఎక్కడికి వెళ్లారో తమకు తెలియదన్న కుటుంబ సభ్యులు
  • పది రోజుల గడువు కావాలన్న రవిప్రకాశ్ తరపు న్యాయవాది
టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. విచారణ నిమిత్తం శనివారం సైబరాబాద్ ప్రత్యేక పోలీసు బృందం, సైబర్ క్రైమ్ అధికారులు బంజారాహిల్స్‌లోని ఆయన ఇంటికి వెళ్లారు. ఆయన కనిపించకపోవడంతో ఈ విషయాన్ని నిర్ధారించారు. ఆయన ఎక్కడికి వెళ్లారో తమకు తెలియదని, తమకేమీ చెప్పలేదని రవిప్రకాశ్ కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. అయితే, రవిప్రకాశ్ విచారణకు సహకరిస్తారని, ఇందుకోసం పది రోజుల గడువు కావాలని రవిప్రకాశ్ తరపు న్యాయవాది పోలీసు ఉన్నతాధికారులకు తెలియజేసినట్టు సమాచారం.

మరోవైపు, రవిప్రకాశ్ ఎక్కడికి వెళ్లారన్న విషయం తమకు కూడా తెలియదని టీవీ9 సిబ్బంది దర్యాప్తు అధికారులకు తెలిపారు. రవిప్రకాశ్ ఫోన్లు కూడా స్విచ్చాఫ్‌లో ఉండడంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లి ఉంటారని భావిస్తున్నట్టు పోలీసులు పేర్కొన్నారు. ఆయన కోసం గాలిస్తున్నట్టు చెప్పారు.

ఇక, విచారణకు హాజరు కానీ నటుడు శివాజీకి మరోమారు నోటీసులు పంపనున్నట్టు హైదరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. ఈసారి కూడా హాజరు కాకపోతే ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. టీవీ9 మాజీ సీఎఫ్‌వో మూర్తిని పోలీసులు శనివారం రెండో రోజూ విచారించి పలు ప్రశ్నలకు సమాధానాలు రాబట్టినట్టు తెలుస్తోంది.
TV9
Ravi prakash
Banjara hills
Hyderabad
Police

More Telugu News