Andhra Pradesh: ఏపీలో 3.46 లక్షల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి.. ఆర్థిక వ్యవస్థను చంద్రబాబు నిర్వీర్యం చేశారు!: వైసీపీ నేత శ్రీకాంత్ రెడ్డి

  • చిన్నకాంట్రాక్టర్లు అల్లాడిపోతున్నారు
  • కొత్త ప్రభుత్వానికి అప్పు దొరక్కూడదని బాబు కుట్ర
  • హైదరాబాద్ లో మీడియాతో వైసీపీ నేత

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందాలన్న కుట్రతో చంద్రబాబు ఏపీ ఖజానాను ఖాళీ చేశారని వైసీపీ నేత గడికోట శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. ఓ క్రమపద్ధతి లేకుండా చంద్రబాబు బిల్లులు చెల్లించడంతో ఇప్పుడు చిన్నచిన్న కాంట్రాక్టర్లు బిల్లుల కోసం కాళ్లు అరిగేలా తిరుగుతున్నారని విమర్శించారు. భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వానికి అప్పులు కూడా దొరకకూడదన్న ఉద్దేశంతో తన చట్టపరిధి దాటి ఇష్టం వచ్చినట్లుగా చంద్రబాబు అప్పులు చేశారనీ, ఏపీ ఆర్థికస్థితి దిగజార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో శ్రీకాంత్ రెడ్డి మాట్లాడారు.

ప్రస్తుతం ఏపీలో 3.46 లక్షల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ‘రాష్ట్రాన్ని బాధ్యతగా నడపాల్సిన మనిషి ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేశాడు. ఎన్నికల్లో లబ్ధిపొందే ప్రయత్నంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దిగజార్చాడు. లక్షల కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయంటే చంద్రబాబుకు ప్రభుత్వాన్ని నడిపే అర్హత ఉందా..? వీటిల్లో జీతాలు, రుణ అప్లికేషన్లు, ట్రాన్స్‌పోర్టు అలవెన్స్, అద్దెలు చెల్లించాలి. ఇంధన చార్జీలు, పేద ప్రజలకు సంబంధించిన సబ్సిడీలు ఉన్నాయి. అవి కాకుండా వివిధ రంగాలకు చెల్లించాల్సిన సబ్సిడీలు రూ.828 కోట్లు, హాస్టల్‌ బిల్లులు దాదాపు రూ.78 కోట్లు, ఈపాస్‌ బిల్లులు రూ.1,248 కోట్లు, వివిధ కార్పొరేషన్స్‌కు గ్రాంట్స్‌గా ఇవ్వాల్సిన డబ్బు రూ.4,800 కోట్లు ఉన్నాయి’ అని చెప్పారు.

ఏపీలో ఒక్క నిర్మాణ రంగంలోనే 29,000  బిల్లులు పెండింగ్ లో పెట్టారని శ్రీకాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఈ బిల్లులకు సంబంధించి రూ.8,200 కోట్ల వరకూ చెల్లింపులు చేయాల్సి ఉంది. ఈ పరిస్థితి చూసి గత నెల 16న చీఫ్‌ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం రివ్యూ చేసి కొన్ని అత్యవసర బిల్లులు చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు. ఎటువంటి మార్పు రాకపోవడంతో గత నెల 23న అధికారులతో సమావేశం నిర్వహించారు. వివిధ రూపాల్లో ఉన్న బిల్లులు చెల్లించకపోవడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన మ్యాచింగ్‌ గ్రాంట్స్‌ అలాగే పెండింగ్‌లో ఉన్నాయి.

ఇంత భారం ఉన్నా.. ఖజానాలో కేవలం రూ. 9000 కోట్లు ఉన్నట్లు చీఫ్‌ సెక్రటరీ తెలిపారు. వివిధ బ్యాంకుల నుంచి తాకట్టుపెట్టి తెచ్చిన లోన్‌లు, ఓవర్‌ డ్రాఫ్ట్‌లపై ఆరా తీసి ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆర్థిక వ్యవస్థను తన స్వప్రయోజనాల కోసం వాడుకోబట్టే ఈ పరిస్థితి వచ్చింది’ అని స్పష్టం చేశారు. తనకు అనుకూలమైన కాంట్రాక్టర్లకు చెల్లింపులు జరిగేలా చంద్రబాబు పనిచేశారని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు.

More Telugu News