Andhra Pradesh: ఆర్టీసీని కొట్టేసేందుకు చంద్రబాబు, ఆయన తాబేదార్లు కుట్ర చేస్తున్నారు!: వైసీపీ నేత పార్థసారధి

  • టీడీపీ ప్రభుత్వం ఆర్టీసీని నిర్వీర్యం చేసింది
  • 60 వేల మంది ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు
  • విజయవాడలో మీడియాతో వైసీపీ నేత

ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ ప్రభుత్వం ఆర్టీసీని నిర్వీర్యం చేసిందని వైసీపీ నేత పార్థసారధి విమర్శించారు. ప్రస్తుతం ఆర్టీసీ మనుగడే ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. నష్టాల్లో కూరుకుపోయిన ఆర్టీసీని కొట్టేసేందుకు చంద్రబాబు, ఆయన తాబేదార్లు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తమ సంస్థను కాపాడుకోవడానికి 60,000 మంది ఆర్టీసీ ఉద్యోగులు చిత్తశుద్ధితో అహర్నిశలు కష్టపడుతున్నారని వ్యాఖ్యానించారు. విజయవాడలోని వైసీపీ కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో పార్థసారధి మాట్లాడారు.

‘ఆర్టీసీలో నెలకొన్న పరిస్థితులతో కార్మికులు,వారి కుటుంబ సభ్యులు ఆందోళనతో  ఉన్నారు. ఆర్టీసీ మూసివేసే పరిస్థితి వస్తే గ్రామాల్లో ట్రాన్స్‌పోర్ట్‌ పరిస్థితి ఎలా ఉంటుందోనని  ప్రజలు చర్చించుకుంటున్నారు. ఆర్టీసీని నిర్వీర్యం చేసే విధంగా చంద్రబాబు ఆలోచన ధోరణి ఉంది. చంద్రబాబుకు,వారి తాబేదారులకు హాయ్‌ల్యాండ్‌ భూముల మీద మక్కువ ఉంది.

ఇప్పుడు వారి కన్ను ఆర్టీసీపై కూడా పడింది. చంద్రబాబు ఆర్టీసీకి తీరని అన్యాయం చేశారు. ఆర్టీసీని నష్టాల నుంచి కాపాడేందుకు 14 ఏళ్ల తన పాలనాకాలంలో బాబు ఒక్క చర్య కూడా తీసుకోలేదు. దేశంలో ఎక్కడా లేనంతగా డీజీల్ పై ఏపీలో భారీగా పన్నులు వేస్తున్నారు’ అని పార్థసారధి ఆరోపించారు.

చంద్రబాబు ఆర్టీసీని దుర్వినియోగం చేశారని పార్థసారధి మండిపడ్డారు. ‘వేల సంఖ్యలో ఆర్టీసీ బస్సులను పోలవరం సందర్శన, నవనిర్మాణ దీక్షలు,ధర్మపోరాట దీక్షలకు,డ్వాక్రా మహిళా సమావేశాలకు చంద్రబాబు తిప్పారు. టీడీపీ పార్టీ కార్యక్రమాల కోసం చంద్రబాబు ఆర్టీసీని వాడుకున్నారు. నేడు వందల కోట్లు ఆర్టీసీకి ప్రభుత్వం అప్పు పడింది.

సోకుల కోసం, ప్రాపకం కోసం పుష్కరాల పేరిట వేలకోట్లు ఖర్చుచేసిన చంద్రబాబు ఆర్టీసీకి కనీసం రూ.100 కోట్లు అయినా చెల్లించాడా?’ అని ప్రశ్నించారు. ఆర్టీసీ నష్టాల ఊబి నుంచి బయటకు రావాలంటే జగన్ వల్లే సాధ్యమని స్పష్టం చేశారు. జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామన్నారు.

More Telugu News