Vijay Sai Reddy: విజయసాయిరెడ్డికి రోజురోజుకీ మతిభ్రమిస్తోంది: యామిని సాధినేని

  • హైదరాబాద్ లో ఆయనకు సరైన చికిత్స అందుతున్నట్టు లేదు
  • సొంతపార్టీని వదిలేసి బీజేపీ కోసం శ్రమిస్తున్నారు
  • గెలుస్తాం, గెలుస్తాం అని అరిస్తే అలుపు తప్ప ఏమీ రాదు

టీడీపీ మహిళా నేత యామిని సాధినేని వైసీపీ అగ్రనేత విజయసాయిరెడ్డిపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఇవాళ మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, విజయసాయిరెడ్డి తీరు చూస్తుంటే ఆయనకు రోజురోజుకు మతిభ్రమిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. ఆయన తన పార్టీ వైసీపీ సంగతి చూసుకోకుండా, బీజేపీని పైకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నట్టుందని విమర్శించారు.

"వెనుకటికి ఎవరో, వాడి పరీక్షలకు కాపీ కొట్టించడానికి పడ్డ కష్టమేదో నా పరీక్షలకు పడుంటే ఈపాటికి ఐఏఎస్ ఆఫీసర్ అయ్యుండేవాడ్నని ఓ సామెత చెబుతుంటారు. అలా ఉంది విజయసాయిరెడ్డి వ్యవహారం. నానాటికీ ఆయనకు మతి పోతోంది. హైదరాబాద్ లో ప్రభుత్వ వ్యవస్థలు పనిచేయడంలేదు. గవర్నమెంట్ ఆఫీసులు, విద్యాశాఖ, ప్రభుత్వ ఆసుపత్రులు ఏవీ సరిగ్గా ఉండడంలేదు. విజయసాయిరెడ్డి హైదరాబాద్ లోనే కూర్చుని ఉన్నారు కాబట్టి, ఆయనకు సరైన చికిత్స అందుతున్నట్టు లేదు.

టీడీపీపై విమర్శలు చేయడం ద్వారా బీజేపీకి మేలు చేయాలని చూస్తున్నారు. అలాకాకుండా ఆ కష్టమేదో సొంత పార్టీ అయిన వైసీపీ కోసం పడుంటే పోయినసారి దక్కని ప్రతిపక్ష హోదా అయినా ఈసారి దక్కేదేమో! మీరు మీ పార్టీ కోసం కష్టపడలేదు కాబట్టి, ఈసారి కూడా వైసీపీకి ప్రతిపక్ష హోదా రాదని ప్రజలు అనుకుంటున్నారు.

ఊరికే గెలుస్తాం, గెలుస్తాం అని విజయసాయిరెడ్డి, అంబటి రాంబాబు అంటున్నారు. అలా అరవడం వల్ల అలుపు తప్ప ఏమీరాదు. గెలవాలంటే ముందు ప్రజల మనసు గెలవాలి. ప్రజల సమస్యలకు, కష్టాలకు పరిష్కారం తెలుసుకునే విధంగా ఒక అనుభవం ఉన్న నాయకత్వం కావాలి. మీరు తల్లకిందులుగా వేళ్లాడినా మీకది సాధ్యంకాదు" అంటూ ధ్వజమెత్తారు.

More Telugu News